తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ పుత్రిక వైఎస్. షర్మిల.. వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆ రాష్ట్ర నిరుద్యోగులకు ఓ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొండంత అండగా ఉంటామని ప్రకటించారు
నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తెలిపారు.
శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్‌టీపీ అడహక్ కమిటీ సభ్యులు పిట్టా రాంరెడ్డి, భూమిరెడ్డి, సాహితీ, ఆయూబ్ ఖాన్, కృష్ణమోహన్ తదితరులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్ నెలలో షర్మిల 72 గంటల పాటు దీక్ష చేసినప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేకపోవడం దారుణమన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల సమయంలోనే వరాలు కురిపించే సంస్కృతిని మానుకుని, బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్ రూపొందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారులో చలనం వచ్చి ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసేవరకు షర్మిల ప్రతి మంగళవారం దీక్ష చేపడతారని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు తెలిపాయి.