ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతుండడం పట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావులు ఈ లేఖలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
తెలంగాణ, రాయలసీమ ఎత్తిపోతల వల్ల తమ జిల్లాకు నష్టం కలుగుతోందని, ఆ ప్రాజెక్టులను నిలిపేయాలని కోరారు. ఎత్తిపోతల పథకాన్ని విస్తరించడం వల్ల ప్రకాశం జిల్లాకు నీరు అందదని తెలిపారు. ఈ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.
మరోవైపు, ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అలాగే కృష్ణా ట్రైబ్యునల్ కూడా తీవ్ర హెచ్చరికలు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించింది.