Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకే నీళ్లు, నిధులు, నియామకాలు: వైయస్ షర్మిల

Advertiesment
తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకే నీళ్లు, నిధులు, నియామకాలు: వైయస్ షర్మిల
, సోమవారం, 25 అక్టోబరు 2021 (21:55 IST)
ప్రజా ప్రస్థానం మహా పాదయాత్ర 6వ రోజు సోమవారం ఉత్సాహంతో ప్రారంభమైంది. నేటి యాత్ర తుమ్మలూరు,రాచలూరు, బైరాగిగూడ, లెమూర్, అగర్మాయిగూడల గుండా సాగింది. వృద్ధులు, విద్యార్థులు, మహిళలు, నాయకులు భారీ స్థాయిలో హాజరయ్యారు.

15 మందికి పైగా నాయకులు ఉదయం తుమ్మలూరు గ్రామానికి ముందే వచ్చి సాదరంగా పార్టీలో చేరారు. సాయంత్రం 6 గంటలకు లెమూర్ వద్ద మాటా ముచ్చట కార్యక్రమం సాగింది. పలువురు లేచి తమ సమస్యలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్ అభిమానులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 14.6 కిలోమీటర్లు ప్రజాప్రస్థానం పాదయాత్రలో సాగింది.
 
మహేశ్వరం నియోజకవర్గంలో పలువురు తెలిపిన సమస్యలు...
తుమ్మలూరు ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది. ఆరు నుంచి 10 తరగతుల వరకు 150 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరికి కలిపి అన్ని సబ్జెక్టులు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే బోధిస్తున్నారు. ప్రత్యేకించి మరుగుదొడ్ల పరిస్థితి హీనం. గ్రామ పంచాయతీ తరఫున వారానికి ఒక్కసారి మాత్రమే వాటిని శుభ్రం చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టెల పొయ్యితో వంట చేయాల్సి వస్తోంది. వంట చేసే వారికి కూడా తక్కువ వేతనాలు ఉన్నాయి. 
 
(15 మందికి పైగా స్థానిక టీఆర్ఎస్ నేతలు పలువురు అనుచరులతో కలసి వైఎస్ఆర్టీపీలో చేరారు. షర్మిలగారు వారిని సాదరంగా పార్టీలోకి చేర్చుకున్నారు.)
 
మా గ్రామంలో (తుమ్మలూరు) చాలా మందికి ప్రభుత్వ పథకాలు అందడం లేదమ్మా. మా గోస వినే నాధుడు కూడా లేడు. అర్హులమైనా మాకు పింఛన్ రావడం లేదు. ఏ ఆసరా లేకపోయినా బియ్యం కార్డులు ఇవ్వడం లేదు. వచ్చే కూలీతో పిల్లలను చదివించుకోవాలో, లేక తినడానికి ఖర్చు చేయాలో తెలియడం లేదు. డబల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఆశ పెట్టి, ఓట్లేయించుకున్నారు. ఇప్పుడు ఇళ్లూ రావట్లేదు. బియ్యం కార్డు కూడా రావడం లేదు.

మేము మోసపోయామమ్మా. ప్రభుత్వాధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. దయ చేసి మీరు నాకు న్యాయం చేయండమ్మా. పద్మ, కిష్టమ్మ, స్వరూప, అశ్విని, శ్రీకాంత్, మమత, నందు విజయాకర్, శ్రీను, అశ్విని, అంజమ్మ, మల్లమ్మ, రామమ్మ, అజయ్ కుమార్, లక్ష్మమ్మ, యాదమ్మ (గుంపుగా చేరి బాధలు వివరించారు. )
 
తుమ్మలూరు లో ఓ బిడ్డను షర్మిల గారు దాదాపు అరగంట పాటు ఎత్తుకొని ఉన్నారు. బిడ్డను చంకలో ఉంచుకునే పాదయాత్ర సాగించారు. తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పాప నవ్వులు చూపరులను ఆకట్టుకున్నాయి. 
 
మేడం నా భార్య మమతకు 32 ఏళ్లు. ఆమె గత ఏడాదిగా గొంతు కాన్సర్ తో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఒక్క సంవత్సరంలోనే రూ. 6 లక్షలు ఖర్చు చేశాం. ప్రస్తుతం నెలకు 10 వేలు ఖర్చు వస్తోంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం రేషన్ రావడం లేదు. ప్రభుత్వానికి మా సమస్య చెప్పి మాకు సాయం చేయించండమ్మా. 
తిరుపతి రెడ్డి, మమత అనే మహిళ తన భాదన వ్యక్తపరిచింది.
 
అమ్మా నా పేరు చంద్రయ్య. నా వయసు 54. గత నాలుగేళ్లుగా పక్షవాతంతో మంచం పట్టాను. ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. తినడానికి కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. పింఛన్ రావాలంటే 57 ఏళ్లు ఉండాలంటున్నారు. నేను పని చేసుకోగలిగితే సాయం అడిగేవాన్ని కాదమ్మా. కానీ మంచంపాలైన నేను మీకు చెప్పడం తప్ప ఏం చేయలేను. న్యాయం చేయండమ్మా. 
 
బిడ్డా.. నా పేరు జి. గోపాల్. నా వయసు 61. ప్రభుత్వం నుంచి పింఛన్ రావట్లేదు. దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేదు. నా కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయమ్మా. వాటి కారణంగా ఏ పనీ చేయలేక మంచం మీదే బతుకుతున్నాం. గత 10 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ఇవాళ నువ్వు నా దగ్గరకు వచ్చినవు బిడ్డా. చానా సంతోషం వేసింది. నువ్వు న్యాయం అందించు బిడ్డా, ఆ దేవుడు నిన్ను చల్లంగా చూస్తడు. 
జి. గోపాల్
 
మా ఊరికి బస్సు సౌకర్యం లేదు. పిల్లలు చదువుకోవాలన్నా పాఠశాల లేదు. పిల్లలు చదువు కోవడానికి 2 కిలోమీటర్ల మేర పోవాల్సిన పరిస్థితి ఉందమ్మా. డబుల్ బెడ్ రూం ఇండ్లు రాలేదు. ప్రభుత్వ సాయం కోసం పై అధికారులకు చెప్పినా మా ఊరిని పట్టించుకోవడం లేదమ్మా. మీరే ఎలాగైనా మా సమస్య తీర్చాలమ్మా. 
 
పాదయాత్ర అనంతరం సాయంత్రం మాట ముచ్చటలో వైయస్ షర్మిల మాట్లాడుతూ..."రైతుల మేలు కోరి వైయస్ఆర్ గారు రుణమాఫీ చేశారు. పేదింటోడికి రోగమొస్తే కుటుంబం అంతా అప్పులపాలవుతుందని ఉచిత వైద్యం అందేలా ఆరోగ్యశ్రీని వైయస్ఆర్ గారు రూపొందించారు. కుయ్...కుయ్...కుయ్ అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు అంబులెన్స్ వైయస్ఆర్ రాకతోనే సాధ్యమైంది.

ఐదేండ్లలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం 45 ల‌క్షల ఇండ్లు నిర్మిస్తే.. వైయస్ఆర్ గారు మాత్రం ఒక్క రాష్ట్రంలోనే పేదల కోసం 46 లక్షల ఇండ్లు కట్టించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్ కల్పిస్తే ల‌క్షల మంది చదువుకుని ఈ రోజు ఎన్నో కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలోనూ 11ల‌క్షల మందికి ఉద్యోగాలను సృష్టించారు. 
 
మహిళల గురించే ఆలోచించే నాయకుడే లేడు. ఇంటి ఖర్చులకు, కిరాయికి, గ్యాస్ కు, కరెంటు బిల్లు ఇవన్నీ కాకుండా స్కూలు ఫీజులు కట్టుకోవాలి. ఇన్ని ఖర్చుల మధ్య పేదలు ఎలా బతుకుతున్నారో కేసీఆర్ ఆలోచించారా ? పొట్ట, తిండి వేర్వేరయినప్పుడు భార్యా భర్తలు ఇద్దరికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు ? వైయస్ఆర్ గారు చనిపోయినప్పుడు గుండె ఆగి చనిపోయిన 700 మందిలో 400 మంది తెలంగాణ వారే. అందుకే తెలంగాణ వారికి మంచి చేయాలని అనుకుంటున్నాను.

ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేసే హక్కు నాకు లేదా ? సొంత ఇల్లు, ఫీజు రీఎంబర్సుమెంటు వంటివి రావాలంటే వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి రావాలి. ఆ పాలన ప్రజలకు అందించేందుకు తమ పార్టీని ఆదరించాలని షర్మిలగారు ప్రజలను కోరారు. సమస్యలతో ప్రజలు ఇక్కట్లపాలవుతున్నారు.

ఈ పరిస్థితులు మారాలి. కేసీఆర్ లాంటి మోసగాళ్లను వదిలించుకోవాలి. తెలంగాణ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. మీకు సేవ చేసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి. మాట తప్పని రాజశేఖరరెడ్డి కూతురిగా మాట ఇస్తున్నాను. మీకు సంక్షేమ పాలన అందిస్తాను."

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ ప్రత్యక్ష రంగంలోకి దిగనున్న లాలూ