Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు ఆర్టీసీ చార్జీల పెంపుపై నిర్ణయం

Advertiesment
TS RTC
, ఆదివారం, 7 నవంబరు 2021 (11:17 IST)
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకునే దిశగా రంగం సిద్ధమైంది. పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్​ గడిచిన నెలలోనే సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపారు. ఏ మేరకు పెంచాలనే అంశంపై కసరత్తు చేయాలని కూడా సూచించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఇవాళ రవాణాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగే అవకాశముంది.
 
బస్సు ఛార్జీలను పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీపై డీజిల్‌ భారం భారీగా పెరిగిన నేపథ్యంలో ఛార్జీలను పెంచాలని అధికారులు ఇటీవల సీఎం కేసీఆర్​ను కోరారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సూచనప్రాయంగా చెప్పడంతో ఏమేరకు పెంచాలనే అంశంపై అధికారులు ఆదివారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 
 
ఉన్నతాధికారులతో రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం. హుజురాబాద్‌ ఉపఎన్నిక కూడా పూర్తి కావడంతో ఛార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశముందని అధికారులు అంటున్నారు. కేంద్రం డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించడంతో.. రోజుకు 65 లక్షల రూపాయలు ఆదా అవుతోంది. 
 
దీంతో ఆర్టీసీకి కొంత ఉపశమనం లభించినా నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచక ప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెంపుపై 3, 4 ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, వాటిపై ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించి... తదుపరి సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
2019 డిసెంబరులో ఆర్టీసీ బస్సు ఛార్జీలను కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంచింది. ఆ తర్వాత చిల్లర తిప్పల పేరుతో మరో 10 పైసలు పెంచింది. ఆర్టీసీ సంస్థలో మొత్తం 17 రకాల సర్వీసులున్నాయి. గరుడా ప్లస్ ఏసీ, రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు, మినీ పల్లె వెలుగు, ఓలేక్ట్రా ఏసీ, మెట్రో లగ్జరీ ఏసీ, మెట్రో డీలక్స్, లో ఫ్లోర్ నాన్ ఏసీ, మెట్రో ఎక్స్​ప్రెస్​, సెమీలో ఫ్లోర్, సిటీ ఆర్డీనరీ, సిటీ సబర్బన్, మఫిసిల్, సిటీ ఆర్డీనరి వంటి బస్సులు ఉన్నాయి. 
 
ప్రస్తుతం ఈ బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం 30 సీట్ల నుంచి 59 సీట్ల వరకు ఉంటుంది. కిలోమీటరుకు 10 రూపాయల నుంచి 35 రూపాయల వరకు ఛార్జీ ఉంది. ఆర్టీసీలో టికెట్ ఛార్జీలను ఎప్పుడైనా ఓఆర్​ ఫ్యాక్టర్‌ దృష్టిలో పెట్టుకుని పెంచుతారు. కేంద్రం డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంపైనా తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కొత్తగా మరో 10 వేల కరోనా కేసులు