పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల తొలి రోజునే తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాస పార్టీ ధాన్యం కొనుగోలుపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చింది. ఈ మేరకు తెరాస సభ్యులు ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొనివున్నాయని అందువల్ల రూల్ 267 కింద తక్షణం ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభ ఛైర్మన్‌కు తెరాస ఎంపీ కె.కేశవరావు డిమాండ్ చేశారు.
భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ) నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల తెలంగాణా రాష్ట్రంలో లక్ష టన్నుల ధాన్యం మార్కెట్ యార్డుల్లో మురిగిపోతుందని ఆయన ఆరోపించారు. పైగా, కేంద్రం కూడా పంట సేకరణపై వివక్షాపూరిత వైఖరిని అవలంభిస్తుందన్నారు. అందువల్ల ధాన్యం సేకరణ అంశంపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.