తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నిక కోసం కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో వివిధ రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇందులోభాగంగా, మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించారు. అలాగే, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున పాల్వాయి స్రవంతి పేర్లను ఇప్పటికే వెల్లడించిన విషయం తెల్సిందే. అలాగే, కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేస్తున్నారు.
కాగా, తెరాస తరపున బరిలోకి దిగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గత 2003 నుంచి తెరాసలో క్రీయాశీలకంగా కొనసాగుతున్నారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.
అయితే, గత 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీతో పాటు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇపుడు ఈయన భారతీయ జనతా పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ముగ్గురూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం.
తెలంగాణ ముఖ్యమంత్ర కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన నేపథ్యంలో మునుగోడులో తెరాసకు ఈ గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇక్కడ గెలుపొంది సత్తా చాటాలన్న గట్టి పట్టుదతో ఉన్నాయి. అదేసమయంలో అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో మునుగోడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెకెక్కింది.