మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి విశ్వాసఘాతుకుడిని తాను చూడలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అయినప్పటికి మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
శుక్రవారం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
గతంలో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారని.. అప్పుడు వారి త్యాగాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా.. గంటలో దామోదరెడ్డి వస్తారని, రెండు గంటల్లో తాను వస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.
'తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే మనకు తెలంగాణ తల్లి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. అయినా చింతించలేదు. ప్రజాప్రయోజనమే తప్ప అధికారం కాదని సోనియా భావించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేకే మూసేసిన (నేషనల్ హెరాల్డ్) కేసును తెరిచారు.
అన్యాయంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులిచ్చారు. కరోనాతో పూర్తిగా కోలుకోకముందే సోనియాగాంధీకి మరోసారి నోటీసులు ఇచ్చారు. పార్టీ అధినేత్రికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిది. మన కన్నతల్లిని అవమానిస్తుంటే మనం తట్టుకోగలమా? సోనియాగాంధీని ఈడీ విచారణ జరుపుతుంటే.. రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షా దగ్గరకు వెళ్లారు.
కాంగ్రెస్ పోరాటంలో కలిసిరాలేదు.. కానీ, కాంట్రాక్టుల కోసం అమిత్ షా దగ్గరకు వెళ్లారు. ఒక్క ఎమ్మెల్యే పోయినా.. కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదు. ఎందుకు భాజపాలోకి వెళ్లావని అడుగుతున్నా. పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పాలి. మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్ చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నుంచి మునుగోడుకు నిధులు తెస్తావా? నెలరోజులు జైల్లో ఉన్న నాతో కలిసి పనిచేయలేనని రాజగోపాల్ చెబుతున్నారు. మరి 90 రోజులు జైల్లో ఉన్న అమిత్‌షాతో ఎలా కలిసి పనిచేస్తావు అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు.
2014లో తర్వాత తెరాస నాపై 120 కేసులు పెట్టింది. అయినా భయపడలేదు.. కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాటం చేస్తానని హెచ్చరించాను. తెలంగాణ సంస్కృతి అమ్ముడుబోయే సంస్కృతి కాదు. సహాయం చేసే సంస్కృతి. ఆ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపై ఉంది. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అన్యాయం చేసే అధికారం నీకు ఎవరిచ్చారు.
ఇప్పుడు మోసం చేసిన వ్యక్తి.. రేపు మరోసారి మోసం చేయడా? రాజగోపాల్‌రెడ్డి లాంటి విశ్వాసఘాతుకుడిని నేనెప్పుడూ చూడలేదు. ఈ మునుగోడు గడ్డ మీద రాజగోపాల్‌రెడ్డిని పాతిపెడదాం. ప్రజలంతా కాంగ్రెస్ పక్కన నిలబడండి' అని రేవంత్ రెడ్డి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.