Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖ్యమంత్రి నేను కాదు.. సోనియా చెప్పినవారే : రేవంత్ రెడ్డి

revanth reddy
, శుక్రవారం, 8 జులై 2022 (07:30 IST)
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ఉండనని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చెప్పినవారే ముఖ్యమంత్రిగా అవుతారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి గురువారానికి ఒక యేడాది పూర్తయిన సందర్భంగా గురువారం గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పని చేస్తాం.. ఏడాది తర్వాత సోనియా గాంధీ ముఖ్యమంత్రిగా ఎవరి పేరు ప్రకటిస్తే వారిని పల్లకిలో మోసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోబెడతాం' ఆయన ప్రకటించారు. 
 
'ఇంత గొప్ప పదవి ఇచ్చినందుకు సోనియాకు జీవితాంతం రుణపడి ఉంటా. రాముడి లాంటి రాహుల్‌ గాంధీకి హనుమంతుడిలా పని చేస్తా. వానర సైన్యం లాంటి కార్యకర్తల సహకారంతో రావణుడు లాంటి కేసీఆర్‌ను ఓడించేందుకు యుద్ధం చేస్తా. రాహుల్‌ని ప్రధాని చేయడానికి పెద్దఎత్తున వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. హుజూరాబాద్‌లో ఓటమికి నేను కుంగిపోతే.. కార్యకర్తలు అండగా నిలబడ్డారు. నా లక్కీ నంబర్‌ 9. అందుకే 99 సీట్లతో కాంగ్రెస్‌కి అధికారమివ్వాలని ప్రజలను కోరుతున్నా. 
 
ప్రభుత్వం అనుమతిస్తే పరేడ్‌గ్రౌండ్‌లో భాజపా ఏర్పాటు చేసిన దాని కంటే పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తాం. సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ నాయకులపై దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటాం అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర లక్ష్యాలు నెరవేర్చేందుకు పీసీసీ కార్యవర్గం కృషి చేయాలన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోటో జి42 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?