Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్తి కోసం ప్రముఖ సినీ నిర్మాత దారుణ హత్య

Advertiesment
anjireddy
, బుధవారం, 4 అక్టోబరు 2023 (13:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో సినీ నిర్మాత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను ఆస్తి కోసం ఈ హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెంలగాణ రాష్ట్రంలోని గోపాలపురం, పద్మారావు నగరుకు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో అనేక చిత్రాలు నిర్మించారు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా, వీరిలో ఓ కుమారుడు మోకిల్లాలో ఉండగా మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉన్నారు. అయితే, అంజిరెడ్డి అమెరికాలో ఉండాలని భావించి పౌరసత్వానికి దరఖాస్తు చేశారు. ఇటీవల అది రాగా, ఇక్కడ ఉన్న ఆస్తులను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. 
 
అయితే, నిర్మాతగా ఉన్న సమయంలో సీనియర్ ఫోటోగ్రాఫర్‌గా పని చేసిన రవి కాట్రగడ్డతో చర్చించి 8 నెలల క్రితం ఆయన అమెరికాకు వెళ్లాడు. రవి కాట్రగడ్డ, అంజిరెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలు రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏజెంట్లు, వ్యాపారులు ఉండే వాట్సాప్ గ్రుపులో పోస్టు చేశాడు. 
 
నెల రోజుల క్రితం అంజిరెడ్డి, తన భార్యతో కలిసి తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో కాట్రగడ్డ రవి, జీఆర్‌ కన్వెన్షన్‌ యజమాని అయిన రాజేశ్‌ను అంజిరెడ్డికి పరిచయం చేశాడు. దీంతో రాజేశ్‌.. అంజిరెడ్డి ఆస్తుల గురించి చర్చించాడు. ముందుగా పద్మారావునగర్‌లో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తానని, దానికి మరమ్మతులు చేసి అందంగా తీర్చిదిద్దుతానంటూ నమ్మించాడు. అయితే, తాను సైదాబాద్‌లో ఉన్న మరో ఆస్తిని విక్రయిస్తానంటూ రాజేశ్‌తో చెప్పాడు. దానికి కూడా ఒక పార్టీ సిద్ధంగా ఉన్నదంటూ ఇద్దరు మహిళలను పరిచయం చేశాడు.
 
ఇదిలాఉండగా.. రాజేశ్‌ కన్ను పద్మారావునగర్‌లో ఉన్న ఇంటిపై పడింది. అంజిరెడ్డి తన భార్యతో కలిసి గత నెల 22న అస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే, గత నెల 29వ తేదీ నాటికి ఇంటి అమ్మకం విషయాలు పూర్తి చేస్తానంటూ నమ్మించాడు. ఇంతలోనే అంజిరెడ్డి తన భార్యను అస్ట్రేలియాకు పంపించగా.. ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. 
 
ఇదే అదునుగా భావించిన రాజేశ్‌, రెండు దఫాలుగా పద్మారావునగర్‌ ఇంటి కోసం రూ.2.1 కోట్ల నగదును చెల్లించినట్లు రూ.50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చినట్లు డాక్యుమెంట్లు తయారు చేశాడు. తాను ముందుగా మేడ్చల్‌లో అద్వైత్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో విల్లాను ఖరీదు చేయాలని, ఆ తరువాత తన ఇతర ఆస్తులను విక్రయిస్తానంటూ రాజేశ్‌తో మాట వరుసకు చెప్పాడు. గత నెల 29న రాజేశ్‌ను వెంటబెట్టుకొని అంజిరెడ్డి మేడ్చల్‌కు వెళ్లాడు. అక్కడ విల్లాను చూసి అస్ట్రేలియాలో ఉన్న భార్యతో చర్చించాడు.
 
అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు మోకిల్లాలో ఉండే కొడుకు శ్రీచరణ్‌రెడ్డి అంజిరెడ్డికి ఫోన్‌ చేశాడు. ఒకసారి ఫోన్‌ రింగ్‌ అయ్యింది. ఆ తర్వాత స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అనుమానంతో అతడి కుమారుడు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జీఆర్‌ కన్వెన్షన్‌లో ఉన్న డిమార్ట్‌ బిల్డింగ్‌ బేస్‌మెంట్‌లో అంజిరెడ్డి కారు పార్కు చేసి ఉండటం, ఆ పక్కనే అతడు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ముందుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. 
 
అదే రోజు రాత్రి అంజిరెడ్డికి ప్రమాదం జరిగిందని ఫోన్‌ వచ్చింది. అయితే, పోలీసులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో అంజిరెడ్డిది హత్య అని తేల్చారు. రాజేశ్‌ తన భార్య, డ్రైవర్‌తోపాటు తన కన్వెన్షన్‌లో పనిచేసే ఇద్దరు బీహారీలతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన - టీడీపీ పొత్తు : ఏపీలో బీజేపీ నేతల్లో వణుకు