ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. తెలంగాణకు వచ్చే నైతిక హక్కు ప్రధానికి లేదంటూ ఆ పోస్టర్లలో ముద్రించారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టుకు మాత్రం ఎందుకివ్వరని ఆ పోస్టర్ల ద్వారా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంపై ఆయన సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రధాని మోడీ ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. గుర్తు తెలియని వ్యక్తులు అంటించిన ఈ పోస్టర్లలో మోడీకి వ్యతిరేక రాతలు ఉన్నాయి. తెలంగాణాపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్న మోడీ.. రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు లేదని ఇంగ్లీష్‌లో రాశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. కర్నాటక రాష్ట్రంలో అప్పర్ భద్రత ప్రాజెక్టుకూ ఇచ్చారు. మరి తెలంగాణాలోని పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వరంటూ పోస్టర్లలో ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే విషయంలో ప్రధాని మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని ఇందులోభాగంగానే తెలంగాణాకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు.