పెళ్లి విందులో చికెన్ కర్రీ వడ్డించలేని వరుడి స్నేహితులు గొడవపెట్టుకున్నారు. దీంతో శుభమా అంటూ జరగాల్సిన ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జగద్గరిగుట్టి రింగ్ బస్తీకి చెందిన యువకుడి, కుత్బుల్లాపూర్‍కు చెందిన యువతికి ఇటీవల వివాహం నిశ్చమైంది. షాపూర్ నగరులోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం ఉదయం వివాహం జరగాల్సివుంది.
అయితే, ఆదివారం రాత్రి ఆడపెళ్లివారు విందు భోజనం ఏర్పాటు చేశారు. వధువుది బీహార్‌కు చెందిన మార్వాడి కుటుంబం కావడంతో వారు పూర్తిగా శాఖాహార భోజనాన్ని మాత్రమే వడ్డించారు.
ఇక విందు ముగుస్తుందన్న సమయంలో వరుడు తరపు స్నేహితులు భోజనాలకు వచ్చారు. అక్కడున్న శాఖాహార వంటలు చూసి చికెన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించి, వధువు తరపు వారితో గొడవకు దిగి, అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ వివాదం కాస్త పెద్దదై ఇరు కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది.
దీంతో సోమవారం జరగాల్సిన వివాహం కాస్త రద్దు అయింది. ఈ వ్యవహారం కాస్త పోలీసుల వద్దకు వెళ్లింది. వారు ఇరు కుటుంబాల సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆగిపోయిన పెళ్లి బుధవారం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.