తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా మానవపాడు మండలంలో రెవెన్యూ అధికారులు ఓ వింత చర్యకు పాల్పడ్డారు. ఓ శ్మశానవాటికను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో జరిగింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓవైపు అసైన్డ్ భూములనే కారణంతో రైతుల నుంచి పచ్చని పంట పొలాలను సైతం గుంజుకొని శ్మశానవాటికలను నిర్మిస్తున్న రెవెన్యూ ఆఫీసర్లు, ఈ గ్రామంలో ఏకంగా శ్మశానవాటికనే ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం.
పెద్దపోతులపాడు గ్రామంలోని సర్వే నంబర్ 9/ఏ/1లో 5.20 ఎకరాల భూమిలో కొన్నేండ్లుగా శ్మశానం ఉంది. కొన్ని దశాబ్దాల కిందే రుక్మిణమ్మ అనే మహిళ ఈ భూమిని శ్మశానానికి దానం చేశారు. అది శ్మశానం అనే తప్ప గతంలో దానంగా ఇచ్చిన భూమి అనే విషయం చాలామందికి తెలియదు. చాలా ఏండ్లుగా గ్రామస్తులు ఎవరు చనిపోయినా ఈ శ్మశానంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల ఆ స్థలంపై రుక్మిణమ్మ వారసుల కన్నుపడింది. శ్మశానం కావడంతో సర్వే నంబర్ 9/ఏ/1ని ఇన్నాళ్లూ హోల్డ్‌లో పెట్టారు. దీనిని రిజిస్ట్రేషన్చేయడానికి వీలులేదు. అలాంటిది ఆఫీసర్ల సహకారంతో గత ఆగస్టు నెలలో 5.20 ఎకరాల భూమిని బెలగంటి మణివర్ధన్‌రెడ్డి, గుమ్మా రెడ్డి పల్లె కృష్ణవేణి, మల్లెపల్లి వెంకటేశ్వరమ్మ, యాగంటి హైమావతి, సాంబయ్యగారి రమాదేవి పేర్లపై రిజిస్ట్రేషన్చేయించుకున్నారు.
తర్వాత వీరిలో ఒకరైన సాంబయ్యగారి రమాదేవి తన పేరుమీద ఉన్న 30 గుంటల స్థలాన్ని సింగవరం దివాకర్ రెడ్డికి సెప్టెంబర్ 4న రిజిస్ట్రేషన్ చేశారు. తీరా విషయం బయటకు రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శ్మశానవాటిక కోసం ఏనాడో రాసిచ్చిన స్థలాన్ని ఎవరికీ తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారసులు, వారికి సహకరించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.