ప్రయివేట్ స్కూళ్ల హాస్టళ్లలో ఉండి పదో తరగతి చదువుకున్న ఇతర ప్రాంతాల విద్యార్థులను ఎక్కడి వారిని అక్కడే తమ సొంత ప్రాంతాల్లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు విద్యార్థుల వివరాలను తమ జిల్లా డిఇఒలకు పంపించాలని ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాన్ని విద్యాశాఖ ఆదేశించింది. ఇదిలా ఉండగా, తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు విచారణ జరిపింది.
ప్రయివేట్ స్కూళ్లు, హాస్టళ్లు తెరిచేందుకు తాత్కాలికంగా అనుమతి ఇస్తామని విద్యాశాఖ హైకోర్టుకు వివరించింది. ఈసారి పరీక్షలు రాయలేని వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రాసుకునే అవకాశం ఇస్తామని తెలిపింది.
దీంతో హైకోర్టు కలగజేసుకుని అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రాసే విద్యార్థులను రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణిస్తారా? అని ప్రశ్నించింది.
దీంతో ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకుని రేపు చెబుతామని అటార్నీ జనరల్ (ఎజి) హైకోర్టుకు తెలిపారు. పరీక్షలు ప్రారంభమైతే ప్రతి ఐదు రోజులకొకసారి నిర్వహణను సమీక్షిస్తామని హైకోర్టు తెలిపింది.