Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెరాస ఎమ్మెల్యే సోలిపేట హఠాన్మరణం - మంత్రుల సంతాపం

తెరాస ఎమ్మెల్యే సోలిపేట హఠాన్మరణం - మంత్రుల సంతాపం
, గురువారం, 6 ఆగస్టు 2020 (08:37 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు హఠాన్మరణం చెందారు. ఆయన పేరు సోలిపేట రామలింగా రెడ్డి, వయసు 57 యేళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, గుండెపోటు రావడంతో బుధవారం అర్థరాత్రి మృతి చెందారు. 
 
కొంతకాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా, ఇటీవలే కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం కాలికి ఇన్‌ఫెక్షన్‌ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. మళ్లీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖాలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో అర్థరాత్రి కన్నుమూశారు.
 
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన 2004, 2008లో తెరాస నుంచి పోటీ చేసి దొమ్మాట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆయన 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
 
రామలింగారెడ్డి ప్రస్తుతం శాసన సభ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సోలిపేట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రామలింగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పని చేశారు. సోలిపేటకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
 
ఆయన భౌతిక కాయాన్ని కుటుంబీకులు సిద్ధిపేట జిల్లాలోని స్వగ్రామం చిట్టాపూర్‌కు తరలించారు. అంత్యక్రియలు అక్కడే నిర్వహించారు. సోలిపేట మృతి చెందిన వార్త తెలుసుకొని చిట్టాపూర్‌కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన మృతిపై సీఎం కేసీఆర్‌తోపాటు, టీఆర్ఎస్‌ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
మరోవైపు, సహచర ఎమ్మెల్యే సోలిపేట మృతిపై పలువురు మంత్రులు, నాయకులు సంతాపం తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సోలిపేట మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
 
ఉమ్మడి మెద‌క్ జిల్లా నుంచి దొమ్మాట, దుబ్బాక‌ నియోజక వర్గాల నుంచి నాలుగుసార్లు గెలిచిన రామలింగారెడ్డి నిరాడంబరుడని, ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. 
 
రామలింగారెడ్డి పార్టీకి తీరని లోటని తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవి ప్రసాద్‌ అన్నారు. సోలిపేట మృతిపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
 
రామలింగారెడ్డి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో సీఎం కేసీఆర్‌తో కలిసి ముందుండి నడిచిన వారిలో రామలింగారెడ్డి ఉన్నారన్నారు. 
 
జర్నలిస్టుగా ఆయన తనకు సుపరిచితుడని, ఎమ్మెల్యేగా ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే వారని చెప్పారు. ఆయన మృతి బాధాకరమని, చేసిన సేవలు మరువలేమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీగా పెరిగిన బంగారం ధర