కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమే గడగడలాడిపోతోంది. అలాగే, తెలంగాణా రాష్ట్రంలో కూడా ఈ వైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా, లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ ప్రజలు ఇష్టానుసారంగా రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. పోలీసులు ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో మంత్రులే స్వయంగా రంగంలోకి దిగారు. తమతమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలను సూచనలు, సలహా చేయడంతో పాటు.. హెచ్చరికలూ చేస్తున్నారు. తాజాగా ఓ జంటకు మంత్రి హరీష్ రావు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇట్టాగయితే ఎట్టా.. కేసులు పెట్టి బొక్కలో వేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం మంత్రి హరీష్ రావు తన సొంత నియోజకవర్గమైన సిద్ధిపేటలో పర్యటించారు. పలువురు తమ ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురితో వెళుతుండటాన్ని గుర్తించి, వారిని ఆపారు. ఎంత బతిమిలాడి చెప్పినా అర్థం చేసుకోవట్లేదని మండిపడ్డారు. 'కరోనా వైరస్‌కు మందే లేదు. స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించడమే మన ముందున్న సమస్యకు ఏకైక పరిష్కారం. ఈ వైరస్‌ను చూసి ప్రపంచమే గడగడలాడుతోంది. మీరేమో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు' అంటూ క్లాస్ పీకారు.
వందలాది మంది అధికారులు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజల కోసం పని చేస్తుంటే, వారికి సహకరించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ప్రజలు తమ వైఖరిని మార్చుకోకపోతే కేసులు పెట్టి, జైల్లో తోయించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.