Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క‌రోనావైర‌స్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి, లాక్ డౌన్‌తో న‌ష్టం ఎంత‌?

Advertiesment
క‌రోనావైర‌స్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి, లాక్ డౌన్‌తో న‌ష్టం ఎంత‌?
, సోమవారం, 30 మార్చి 2020 (18:55 IST)
ఆక్వా ఉత్ప‌త్తుల్లో దేశంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ్ర‌స్థానంలో ఉంది. కేర‌ళ నుంచి తూర్పు తీరంలో బెంగాల్, ప‌శ్చిమ తీరాన గుజరాత్ వ‌ర‌కూ 9 రాష్ట్రాల్లో ఆక్వా సాగు జ‌రుగుతోంది. అందులో రొయ్య‌లు, చేప‌ల ఉత్ప‌త్తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముందుంది.

 
విదేశాల‌కు జ‌రిగే ఎగుమ‌తుల్లో మూడింట రెండు వంతులు ఒక్క ఏపీ నుంచే జ‌రుగుతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగా విదేశీ మార‌క ద్ర‌వ్యం కూడా ల‌భిస్తోంది. కానీ, ఇప్పుడు ఎగుమ‌తులు నిలిచిపోవ‌డం, ప్రోసెసింగ్ యూనిట్లు మూత‌ప‌డ‌డం, రొయ్య‌ల చెరువుల వ‌ద్ద కూలీల కొర‌త కూడా వేధిస్తుండ‌డంతో ఆక్వా సాగుదారులు అష్ట‌క‌ష్టాలు పడుతున్నారు. క‌రోనావైరస్ ప్ర‌భావంతో ఆక్వా రంగం అల్ల‌క‌ల్లోలంగా మారుతోంద‌నే ఆందోళ‌న‌తో క‌నిపిస్తున్నారు.

 
ఇప్ప‌టికే పౌల్ట్రీ, ఇప్పుడు ఆక్వా
దేశంలో పౌల్ట్రీ రంగం తీవ్రంగా స‌త‌మ‌తం అవుతోంది. క‌రోనావైరస్ వ్యాపిస్తుంద‌నే ప్ర‌చారంతో మాంసం అమ్మ‌కాలు ప‌డిపోవ‌డంతో ధ‌ర‌లు అత్యంత క‌నిష్ట స్థాయికి దిగ‌జారాయి. అదే స‌మ‌యంలో గుడ్ల ఎగ‌మ‌తులు కూడా నిలిపోయి పౌల్ట్రీ రైతులు బెంబేలెత్తిపోయారు. అపోహ‌లు వ‌ద్ద‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికే భారీ నష్టం జరిగిపోయింది.

 
ఆక్వా రంగంలోనూ అదే పరిస్థితి క‌నిపిస్తోంది. లైవ్ స్టాక్ కావ‌డంతో ఇలాంటి రంగాల్లో త‌మ ఉత్ప‌త్తుల‌ను నిలువ ఉంచుకోలేక‌, కొనేవారు లేక రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఉత్ప‌త్తిదారుల‌కు రెండు ర‌కాలుగా దారులు మూత‌ప‌డ‌డంతో పెను న‌ష్టాలు చ‌వి చూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఎగుమ‌తుల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మార‌క ద్ర‌వ్యం సంపాదిస్తున్న రొయ్య‌ల సాగుదారులు మ‌రిన్ని స‌మ‌స్య‌లు చ‌విచూడ‌క త‌ప్ప‌డం లేదు.

 
తొలుత టైగ‌ర్ రొయ్య‌లు.. ఇప్పుడు వ‌నామీ
కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ 'ద మెరైన్ ప్రొడ‌క్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా)' లెక్క‌ల ప్ర‌కారం, ఆక్వా ఉత్ప‌త్తుల్లో రొయ్య‌లు, చేప‌లు ప్ర‌ధానంగా ఉన్నాయి. పీత‌లు వంటివి కొంద‌రు ఉత్ప‌త్తి చేస్తున్నా అవి చాలా త‌క్కువ మొత్తంలో ఉన్నాయి.

 
రొయ్య‌ల ఉత్ప‌త్తులు గ‌మ‌నిస్తే 1990 త‌ర్వాత బాగా పెరిగాయి. ఎగుమ‌తుల‌కు ద్వారాలు తెరుచుకోవ‌డంతో అనేక మంది త‌మ పొలాల‌ను రొయ్య‌ల సాగుకి మ‌ళ్లించారు. ఆంధ్రప్ర‌దే‌లో తొలుత టైగ‌ర్ రొయ్య‌లు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేసేవారు. 2001-02 లెక్క‌ల ప్ర‌కారం, 70 వేల హైక్టార్ల‌లో సాగు అయ్యేది. కానీ, వివిధ స‌మ‌స్య‌ల కార‌ణంగా టైగ‌ర్ రొయ్య‌ల ఉత్ప‌త్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టింది. అనేక మంది త‌మ చెరువుల్లో టైగ‌ర్ రొయ్య‌లను వేయ‌డం మానుకున్నారు.

 
2017-18 నాటికి ఏపీలో టైగ‌ర్ రొయ్య‌ల సాగు 1880 హెక్టార్ల‌కు ప‌రిమితం అయ్యింది. 2012-13 త‌ర్వాత వారంతా టైగ‌ర్ రొయ్య‌ల నుంచి వ‌నామీ వైపు మళ్లారు. ఇప్ప‌టికీ ప‌శ్చిమ బంగాలో మాత్రం అత్య‌ధికంగా 51.084 హెక్టార్ల‌లో టైగ‌ర్ రొయ్య‌ల ఉత్ప‌త్తి జ‌రుగుతోంది.

 
వ‌నామీ రొయ్య‌ల ఉత్ప‌త్తిలో ప్రస్తుతం దేశంలోనే ఏపీ అగ్ర‌స్థానంలో ఉంది. 2009-10 సంవ‌త్స‌రంలో కేవ‌లం 264 హెక్టార్ల‌లో వ‌నామీ సాగు చేసిన‌ రైతులు 2017-18 నాటికి దానిని 62,342 హెక్ట‌ర్ల‌కు విస్త‌రించారు. దాని నుంచి 4,56,300 ట‌న్నుల దిగుబ‌డి సాధించారు. దేశంలో ఆ ఏడాది 6.22 ల‌క్ష‌ల ట‌న్నుల దిగుబ‌డి వస్తే, అందులో 70 శాతం ఏపీ నుంచే జ‌ర‌గ‌డం విశేషం.

 
2018-19 లెక్క‌ల ప్ర‌కారం, దేశం మొత్తం మీద 6.14 ల‌క్ష‌ల ట‌న్నుల రొయ్య‌ల‌ ఉత్ప‌త్తి జ‌రుగుతుంటే అందులో 4.59 ల‌క్ష‌ల టన్నులు ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఆ త‌ర్వాతి స్థానంలో బెంగాల్ 78 వేల ట‌న్నులు, గుజ‌రాత్ 59 వేల ట‌న్నులు, త‌మిళ‌నాడు 47 వేల ట‌న్నులు, ఒడిశా 43 వేల ట‌న్నుల చొప్పున ఉత్ప‌త్తి సాధించాయి.

 
ఎగుమ‌తుల‌తో దేశానికి భారీ ఆదాయం
ఏపీలోని 9 తీరప్రాంత జిల్లాల్లో రొయ్య‌ల సీడ్ త‌యారీ కేంద్రాలు, రొయ్య‌ల చెరువులు విస్త‌రించాయి. 975 కిలోమీట‌ర్ల పొడ‌వునా అవి క‌నిపిస్తాయి. గోదావ‌రి, నెల్లూరు జిల్లాలు ముందున్నాయి. ఉప్పునీటి, మంచినీటి ఆధారంగా రొయ్యలు, చేప‌ల సాగు చేస్తున్నారు. పూర్తిగా ఎగుమ‌తి ఆధారిత‌ రంగంగా ఆక్వా ఉంది. చేప‌ల‌ను దేశంలోని ఈశాన్య రాష్ట్రాలతో పాటు ప‌శ్చిమ బెంగాల్‌కు ఎక్కువ‌గా ఎగుమ‌తి చేస్తారు.

 
రొయ్యలు మాత్రం దాదాపుగా విదేశాల‌కే. అందులోనూ ఎగుమ‌తుల్లో ప్ర‌పంచంలోనే ప్ర‌ధాన దేశాల్లో భారత్ ఒక‌టిగా నిల‌వ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి వ‌స్తున్న దిగుబ‌డులు కీల‌కం. రొయ్య‌ల‌ ఎగుమ‌తుల ద్వారా దేశానికి 2018-19 సంవ‌త్స‌రంలో 4,610 మిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం ల‌భించింది. చేప‌ల ఎగుమ‌తుల ద్వారా మ‌రో 700 మిలియ‌న్ డాల‌ర్ల విదేశీ మార‌క ద్ర‌వ్యం దేశానికి వ‌చ్చింది. అందులో 3.5వేల మిలియ‌న్ డాల‌ర్లకు పైగా ఆదాయం ఒక్క ఆంద్ర‌ప్ర‌దేశ్ నుంచి జ‌రిగిన ఎగుమ‌తుల ద్వారా రావ‌డం విశేషం.

 
ఊగిస‌లాట‌లో ఆక్వా రైతులు
వ్య‌వ‌సాయం లాభ‌సాటిగా లేద‌నే కార‌ణంతో అనేక‌మంది ఆక్వా వైపు మ‌ళ్లారు. ప్ర‌పంచ ప‌రిణామాలను బ‌ట్టి ఆక్వా నిత్యం ఊగిస‌లాటులో ఉంటుంది. ఇప్పుడు ప్రపంచమంతా క‌రోనా భయం ఉండటంతో ఎగుమ‌తుల‌కు బ్రేకులు ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో దేశంలో లాక్‌డౌన్ కార‌ణంగా ప్రోసెసింగ్ ఆగిపోయింది. రొయ్య‌ల చెరువుల్లో ఎగుమ‌తికి సిద్ధ‌మైన త‌ర్వాత వాటిని ప్రోసెసింగ్ యూనిట్ల‌కు త‌ర‌లించిన త‌ర్వాత అవ‌స‌రం అయితే నిల్వ చేసుకునేందుకు కొన్ని చోట్ల అవ‌కాశాలున్నాయి. కానీ ప్ర‌స్తుతం ప్రోసెసింగ్ దాదాపుగా స్తంభించిపోవ‌డం పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది.

 
రొయ్య‌లు చెరువులో కిలోకు ఎన్ని తూగుతాయ‌న్న దానిని బ‌ట్టి కౌంట్ లెక్కిస్తారు. స‌హ‌జంగా కిలోకి 30, 40, 50 కౌంట్ వచ్చే రొయ్యలు బాగా ఎగుమ‌తి అవుతూ ఉంటాయి. అంత కౌంట్ వ‌చ్చే వ‌ర‌కూ చెరువుల్లో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త రైతుల‌పై ఉంటుంది. కానీ, ప్ర‌స్తుతం 30 కౌంట్ వ‌చ్చిన త‌ర్వాత రొయ్య‌ల‌ను ప‌ట్టి ప్రోసెసింగ్ త‌ర‌లించే అవ‌కాశం లేక‌పోతోంద‌ని ప‌లువురు వాపోతున్నారు.

 
ఏపీకి ఆక్వా కేంద్రంగా ఉన్న భీమ‌వ‌రం ప్రాంతానికి చెందిన క‌లిదిండి స‌న్యాసిరాజు అనే రైతు బీబీసీతో మాట్లాడుతూ... "40 ఎక‌రాల్లో రొయ్య‌ల చెరువు వేశాను. ఇప్పుడు 40 కౌంట్ ఉంది. మ‌రో ప‌ది రోజుల్లో ప‌ట్టాలి. అస‌లే వైర‌స్ ప్ర‌భావం ఉంది. చుట్టుప‌క్క‌ల చాలా చెరువులు సిద్ద‌మైన త‌ర్వాత కూడా వైర‌స్ కార‌ణంగా చేజారిపోయాయి. అలాంటి ప్ర‌మాదం మాకు కూడా వ‌స్తుంద‌నే భ‌యం ఉంది. కానీ ఇప్పుడు రొయ్యలు ప‌డితే తీసుకెళ్లేవారు లేరు. 

 
ధ‌ర‌లు పడిపోయాయి. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో 30 కౌంట్ కిలో రొయ్య రూ.480 ఉండేది. ఇప్పుడ‌ది కిలో రూ.250కి కూడా కొనేవారు లేరు. ఎవ‌రైనా కొన్నా గానీ ప్రోసెసింగ్ యూనిట్లు మూత‌ప‌డ్డాయ‌ని చెబుతున్నారు. పోనీ చెరువులు కాపాడుకుందామ‌నుకుంటే కూలీలు కూడా రావ‌డానికి ఆస్కారం క‌నిపించ‌డం లేదు. మా ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యు అన్నట్టుగా ఉంది. ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టాను.. చేతికి పెట్టుబ‌డి అయినా వ‌స్తుంద‌నే ఆశ క‌నిపించ‌డం లేదు" అని వివ‌రించారు.

 
అయితే, 50 మంది సిబ్బందితో రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలు తమ కార్యకలాపాలను కొనసాగించుకునేలా అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

 
ఎవరూ మోసపోవద్దు: మంత్రి
ఆక్వా ఎగుమ‌తుల‌కు సంబంధించి ఎక్స్ పోర్ట్స్ ఇన్‌స్పెక్ష‌న్ అథారిటీ నుంచి అనుమ‌తులు రావాల్సి ఉంటుంది. ఆ విష‌యాలు ఆటంకాలు రాకుండా కేంద్రంతో సంప్ర‌దిస్తున్నామ‌ని ఏపీ మ‌త్స్య‌శాఖ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ తెలిపారు.

 
ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. "కరోనా వైరస్ వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి. వైరస్ పేరుతో కొంద‌రు దళారులు మోసాల‌కు పాల్ప‌డుతున్న మా దృష్టికి వ‌చ్చింది. వారి మాటలను నమ్మి ఆక్వా రైతులు మోసపోవద్దు. ప్రభుత్వం ధ‌ర‌లు నిర్ణ‌యించింది. త‌క్కువ‌కు కొనుగోలు చేయ‌డానికి లేదు. రైతులకు నష్టం కలిగించే దళారులు, వ్యాపారులపై క్రిమినల్ చర్యలకు వెన‌కాడం. రైతులకు నష్టం కలిగిస్తే వారి వ్యాపార‌ లైసెన్సులు రద్దు చేస్తామ‌ని చెప్పాం. 

 
కేంద్ర ప్రభుత్వం ద్వారా నోడల్ ఏజెన్సీగా ఉన్న ఎంపెడాకు అధికారాలు ఇచ్చాం. ఆక్వాకు సంబంధించిన సీడ్ వేయడం, ఫీడ్ అందించడం, ప్రాసెసింగ్ నిర్వహణ, రవాణాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తున్నాం. స్థానికంగా పోలీస్, రెవెన్యూ యంత్రాంగాల నుంచి ఆటంకాలు రాకుండా చూస్తాం. ఎగుమతిదారుల విష‌యంలో ఆటంకాలు తొల‌గించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. ఇదే విషయమై జిల్లాల‌ అధికారులు, ఆక్వా రైతు సంఘాలు, ఎగుమతిదారులతో చర్చలు జరుపుతున్నాం" అని వివ‌రించారు.

 
మేత కూడా భార‌మే..న‌ష్టం కోట్ల‌లోనే
గ‌త కొన్నేళ్లుగా ఆక్వా విస్త‌రిస్తోంది. అనేక చోట్ల ప్ర‌భుత్వ అనుమ‌తులు కూడా లేకుండా ఆక్వా చెరువులు త‌వ్వుతున్న ఘ‌ట‌న‌లున్నాయి. లిక్క‌ర్, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ‌లు కూడా ఇప్పుడు ఆక్వా రంగంలో అడుగు పెట్టాయి.

 
డిసెంబ‌ర్, జ‌న‌వ‌రిలో చెరువుల్లో వేసిన సీడ్ ఇప్పుడు చేతికందే ద‌శ‌లో ఉంది. చెరువులు ప‌ట్టి మార్కెట్‌కి త‌ర‌లించాల‌నే ఆలోచన‌లో ఉన్న రైతుల‌కు లాక్‌డౌన్ పెద్ద స‌మ‌స్య‌గా మ‌రింది. ఆదుకుంటామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌లు అమ‌లులోకి రావాలని ఆశాభావంతో అంతా ఉన్నారు. ఆక్వా రైతుల‌కు ఊర‌ట క‌ల్పించేందుకు గానూ ఏపీ ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న‌లు అమ‌ల‌యితేనే రైతుల‌కు మేలు క‌లుగుతుంద‌ని ఆక్వా సాగుదారుడు పి. స‌త్య మోహ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 
ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ "ఇటీవ‌ల క‌రెంటు స‌బ్సిడీలు పెర‌గ‌డంతో రైతుల‌కు ఊర‌ట కలిగింది. కానీ, గ‌త డిసెంబ‌ర్‌లో హ‌ఠాత్తుగా మేత ధ‌ర‌లు పెంచేశారు. ట‌న్నుకి రూ. 6వేల చొప్పున పెంచేయ‌డం పెనుభారంగా మారింది. ఎక‌రా చెరువులో పంట చేతికి రావాలంటే క‌నీసం 50 కౌంట్‌కి చేరాల‌న్నా రూ.6 ల‌క్ష‌ల‌కు త‌క్కువ కాకుండా ఖ‌ర్చ‌వుతుంది. దానిని 40, 30 కౌంట్‌కి చేర్చాలంటే ఇంకా పెద్ద మొత్త‌మే ఖ‌ర్చు చేయాలి. కొన్ని సంద‌ర్భాల్లో ఈహెచ్ పీ, వైట్ స్పాట్ స‌హా ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో ఆందోళ‌న‌ల మ‌ధ్య చెరువు చేతికి వ‌చ్చే వ‌ర‌కూ ఎదురు చూస్తుంటాం. 

 
కానీ, ఇప్పుడు మేత ధ‌ర పెరిగి, పైగా అత్య‌వ‌స‌ర‌మైన ప‌రిస్థితుల్లో కూడా రొయ్య‌ల మేత విక్ర‌య‌దారులు పెడుతున్న నిబంధ‌న‌లు రైతుల‌కు స‌మ‌స్య‌గా మారాయి. అదే స‌మ‌యంలో చైనా ఎగుమ‌తుల‌కు ఎటువంటి ఆటంకం లేదు. గ‌త వారం రోజులుగా కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఎప్పటిలాగే ఎగ‌ముతులు జ‌రుగుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్రోసెసింగ్ యూనిట్లు మూత పేరుతో ధ‌ర‌లు త‌గ్గించేసి ఆక్వా సాగుదారుల‌ను చిక్కుల్లో నెడుతున్నారు. దాంతో ఈ ఒక్క సీజ‌న్‌లోనే ఏపీలోని ఆక్వా సాగులో రూ.1200 కోట్ల న‌ష్టం త‌ప్ప‌ద‌ని అంచ‌నా. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వ ఆదేశాలు అమ‌లైతే కొంత ఉప‌శ‌మ‌నం కలుగుతుంది" అని వివ‌రించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉంటే మద్యం.. ఎక్కడ?