మహారాష్ట్రలోని ఓ కుటుంబం అనుసరించిన నిర్లక్ష్యం వల్ల ఒకే ఇంట్లోకి 25 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్ని పరిశీలిస్తే, మహారాష్ట్రలోని సంగ్లీ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. మార్చి 23వ తేదీన స్వగ్రామానికి తిరిగొచ్చారు. అయితే విదేశాల నుంచి వచ్చిన తర్వాత 14 రోజులపాటు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలన్న నిబంధనల మేరకు వారు హోమ్ క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు.
అయితే వారి ఇల్లు ఇరుకుగా ఉండటం, ఆ ఇంట్లో 20 మంది నివాసం ఉండటంవల్ల అందరికీ కరోనా వైరస్ వ్యాపించింది. అయితే వారు బయటకు వెళ్లకపోవడంవల్ల ఇరుగుపొరుగు ఎవరకీ ఈ వైరస్ సోకలేదు.
దీనిపై కలెక్టర్ అభిజిత్ చౌదరీ మాట్లాడుతూ.. ఇటువంటి కేసులను ఆరంభంలోనే గుర్తించడం ద్వారా మంచే జరిగిందని, ఒకే కుటుంబంలో ఇందరికి వైరస్ సోకిన విషయం ఆరంభంలోనే గుర్తించకపోతే వాళ్లు స్వేచ్ఛగా సమాజంలో తిరిగేవారని, తద్వారా ఈ వైరస్ మరింత మందికి సోకేదని అన్నారు.
వైరస్ సోకిన 25 మందని సంగ్లీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించామని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కలెక్టర్ తెలిపారు. ఏదిఏమైనా, ఇలాంటి వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.