తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఏకకాలంలో భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఇంతటి స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జిల్లా కలెక్టర్లతో సహా అన్ని స్థాయిల్లో 65 మంది ఐఏఎస్ అధికారలకు స్థానచలనం కల్పించింది. 21 జిల్లాల కలెక్టర్లతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే పలువురు జూనియర్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. త్వరలోనే మరికొంత మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
అయితే, తాజా బదిలీల్లో మంత్రి కేటీఆర్ ముద్ర సుస్పష్టంగా ఉందని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాబోయే నాలుగేళ్లపాటు కొనసాగేలా ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్‌ను నియమించిన విషయం తెలిసిందే. అనంతరం, పాలన వ్యవస్థనూ ప్రక్షాళన చేస్తారనే అభిప్రాయాలు వెలువడ్డాయి. అందుకు అనుగుణంగానే సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది.
జీఏడీ స్పెషల్ సీఎస్ అథర్ సిన్హాను పశు సంవర్థక శాఖకు బదిలీ చేశారు. నిజానికి, సీఎస్ సోమేశ్ కుమార్ కంటే ఆయన సీనియర్. సీఎస్ రేసులోనూ ఉన్నట్లు కథనాలు వచ్చాయి. దాంతో, ఆయనకు ఇండిపెండెంట్ చార్జి ఇవ్వవచ్చని అంతా భావించారు. కానీ, జీఏడీ నుంచి ఆయనను అంతగా ప్రాధాన్యం లేని పశు సంవర్థక శాఖకు బదిలీ చేశారు. ఇక, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా కీలకమైన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను నిర్వహించిన రజత్ కుమార్‌ను ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే, మరికొంత మంది అధికారులకు ప్రాధాన్య, అప్రాధాన్య పోస్టులను కేటాయించింది.
మరోవైపు, పట్టణ పరిపాలనను ఉరకలెత్తిస్తామన్న మంత్రి కేటీఆర్.. ఐఏఎస్‌ల పోస్టింగుల్లో తన మార్కు చూపించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మునిసిపల్ కమిషనర్లుగా, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లుగా 2014-16 బ్యాచుల యువ అధికారులను ఆయన ఎంపిక చేశారు. నలుగురు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లు, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, నిజాంపేట మునిసిపల్ కమిషనర్లుగా యువ అధికారులను నియమించడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు...
సూర్యపేట కలెక్టర్‌గా టి. వినయ్ కృష్ణా రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా వి. వేంకటేశ్వర్లు, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా సిక్త పట్నాయక్, నిర్మల్ కలెక్టర్‌గా ముషారఫ్ అలీ, ములుగు జిల్లా కలెక్టర్‌గా ఎస్. కృష్ణ ఆదిత్య, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా వీపీ గౌతమ్, జగిత్యాల కలెక్టర్‌గా జి. రవి, జనగామ కలెక్టర్‌గా కె, నిఖిల, వనపర్తి జిల్లా కలెక్టర్‌గా, ఎస్.కె. యాస్మిన్ బాషా, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా ఎస్. వెంకటరావు, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్‌గా అబ్దుల్ అజీమ్, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శరత్, వికారాబాద్ కలెక్టర్‌గా పౌసుమీ బసు, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ఎం.వీ.రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా శ్రీదేవసేన, నారాయణపేట్ జల్లా కలెక్టర్‌గా హరిచందన దాసరి, హైదరాబాద్ కలెక్టర్‌గా శ్వేతా మహంతి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హన్మంతు, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా శృతిఓజా బదిలీ అయ్యారు.