ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. దీనికితోడు కాలేజీల నిర్వహణాబారం అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో అనేక కాలేజీలు మూతపడుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.
హైదరాబాద్, జేఎన్‌టీయూ పరిధిలో 2020-21కి సంబంధించి ఇప్పటికి 8 కళాశాలలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. ఒక్కోదాంట్లో 300 సీట్లు ఉన్నాయనుకున్నా 2,400 సీట్లు తగ్గడం ఖాయమైంది. 25 వరకు కోర్సులు ఎత్తివేస్తామంటూ మరికొన్ని కళాశాలలు అనుమతి కోరాయి. ఇలా 1,500 సీట్లు తగ్గనున్నాయి. ఈ మూడు రోజుల్లో వచ్చే దరఖాస్తులనూ పరిగణిస్తే 7 వేల వరకు సీట్లు రద్దవుతాయి.
ఇకపోతే, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో దరఖాస్తు ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ అయ్యాక అక్కడా ఇదే పరిస్థితి ఉంటుంది. మరోవైపు అనుబంధ గుర్తింపు జారీకి అధికారులు ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తారు. లోపాలు బయటపడితే గుర్తింపు, కోర్సులకు అనుమతి నిరాకరించొచ్చు. అప్పుడు మరికొన్ని తగ్గి మొత్తం సీట్ల సంఖ్య 80 వేల దిగువకు పడిపోవచ్చు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 183 ఇంజనీరింగ్ కళాశాలల్లో మొత్తం 91,988 (14 ప్రభుత్వ కళాశాలల్లో 3,058, 169 ప్రైవేటు కళాశాలల్లో 88,930) సీట్లున్నాయి. వీటిలో ఈసారి ప్రైవేటులో 9 వేలకు పైగా తగ్గే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.