Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం : ఆరోగ్యశ్రీతో ఆయుష్మాన్ భారత్ లింకు

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం : ఆరోగ్యశ్రీతో ఆయుష్మాన్ భారత్ లింకు
, బుధవారం, 19 మే 2021 (09:07 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కూడా ఇకపై అమలు చేస్తాని ప్రకటించారు. రాష్ట్రంలో పేదలకు ప్రైవేటు వైద్యాన్ని చేరువచేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి ఇకనుంచి ఆయుష్మాన్‌ భారత్‌ కూడా సహాయకారిగా ఉంటుందని పేర్కొన్నారు. 
 
ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ స్కీం, ఆయుష్మాన్‌ భారత్‌-ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన పథకాలు కలిసి ఆయుష్మాన్‌ భారత్‌- ఆరోగ్యశ్రీగా మారింది. దీంతో రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సలతోపాటు, ఆయుష్మాన్‌ భారత్‌లో ఉన్న చికిత్సలు కూడా అందుబాటులోకి రానున్నాయి. 
 
కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్‌భారత్‌లో చేరాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గతంలోనే నిర్ణయించిన మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం నేషనల్‌ హెల్త్‌ అథారిటీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకొన్నది. దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవోకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఆదేశాలు జారీచేశారు. 
 
పథకం అమలు విధివిధానాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఖరారుచేసింది. ఆరోగ్యశ్రీలో 972 రకాల చికిత్సలు అందుబాటులో ఉండగా, ఆయుష్మాన్‌ భారత్‌లో 1,393 ఉన్నాయి. ఆయుష్మాన్‌లో లేని 540 ప్రొసీజర్స్‌ ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆరోగ్యశ్రీలో లేని 685 ప్రొసీజర్స్‌ ఆయుష్మాన్‌లో ఉన్నాయి. దీంతో ఈ రెండింటిని కలపడంవల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఉదాహరణకు డెంగ్యూ, మలేరియా వంటివాటికి ఆరోగ్యశ్రీ వర్తించదు. కానీ ఆయుష్మాన్‌ వర్తిస్తుంది. అలాగే కిడ్నీ, లివర్‌ మార్పిడి వంటి చికిత్సలు ఆరోగ్యశ్రీలో ఉండగా.. అవి ఆయుష్మాన్‌లో లేవు. ఈ రెండింటిని కలిపితే అన్ని చికిత్సలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. రాష్ట్ర ప్రజలకు 1,887 రకాల చికిత్సలకు ఉచితంగా వైద్యం అందుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చర్చిలు - మసీదులు కోవిడ్ కేర్ సెంటర్లకు పనికిరావా?