తెలంగాణా రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెంచేశారు. మంగళవారం నుంచి ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫీజుల పెంపు ప్రతిపాదనపై టీఎస్ ఏఎఫ్ఆర్‌సి ఆమోదముద్ర వేసింది. పైగా, ఈ ఫీజుల వసూలకు ఆ రాష్ట్ర హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. అదేసమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఈ పెంచిన ఫీజులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇంజనీరింగ్ కోర్సుల విద్యా ఫీజును పెంచుతూ తెలంగాణ స్టేట్ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటింగ్ కమిటీ ఇది వరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పనిలోపనిగా కొత్తగా పెంచిన ఫీజులను వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రంలోని 79 కళాశాలల యాజమాన్యాలు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి వినతికి హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూనే పెంచిన ఫీజుల వసూలుకు సానుకూలంగా ఆమోదం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని 36 ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు ఏకంగా లక్ష మేరకు దాటిపోయింది.
మరోవైపు, పెంచిన ఫీజులకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫలితంగా బీసీ, ఈబీసీ కోటా అభ్యర్థులు అయోమయంలో పడిపోయారు. మరోవైపు రేపటి నుంచే ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ ప్రారంభమవుతున్నా ఫీజులపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.