దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా... కొంతమంది మనషులు మాత్రం మారడం లేదు. విద్యావంతులతో పాటు.. నిరక్ష్యరాస్యులు కూడా ఒకేలా ప్రవర్తిస్తున్నారు. ఓ తండ్రి అపుడ పుట్టిన ఇద్దరు కవల ఆడపిల్లలకు విషం తాపించాడు. దీంతో ఆ ఇద్దరు శిశువులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం దేశాయిపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేశాయిపల్లికి చెందిన కృష్ణవేణి అనే మహిళ ఇటీవల ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వారికి ఇప్పటికే ఓ కూతురు ఉంది.
రెండో కాన్పులో కూడా ఆడపిల్లలే పుట్టారని తండ్రి కేశవులు ఆగ్రహంతో ఊగిపోయాడు. ముగ్గుర ఆడపిల్లల పోషణ తనవల్లకాదని వాపోయాడు. ఈ క్రమంలో ఎవరికీ తెలియకుండా కవల ఆడ శిశువులతో పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ శిశువులు అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమినించిన కుటుంబ సభ్యులు వారిని పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు.
అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మెరుగైన వైద్య పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇటీవల కేశవులు ఓ దుకాణంలో పురుగుల మందు డబ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.