Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహబూబ్ నగర్‌‍లో త్రిముఖ పోటీ.. గెలుపు గుర్రం ఎవరిదో...!!

telangana assembly poll
, గురువారం, 23 నవంబరు 2023 (14:37 IST)
మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. గత రెండు ఎన్నికల్లో రాష్ట్ర అబ్కారీ శాఖామంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసి గెలుపొందారు. ఇపుడు మరోమారు గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో ఈ స్థానంలో పోరు అమితాసక్తిగా మారింది. గత 2014లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ కుమార్ రెడ్డి భాజపా అభ్యర్థిగా తొలిసారి పోటీ చేస్తున్నారు.
 
గత ఎన్నికల్లో మహకూటమి పొత్తులో తెదేపా అభ్యర్థిగా నిలబడిన మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్), మైనారిటీ వర్గానికి చెందిన సయ్యద్ ఇబ్రహీం, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్లు ఇటీవలే భారాసలో చేరడం తనకు అనుకూలతను పెంచుతాయని శ్రీనివాస్ గౌడ్ భావిస్తున్నారు. ఐటీ పార్క్ ఏర్పాటు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం, పెద్దచెరువు సుందరీకరణ, తీగల వంతెన ఏర్పాటు, మినీ శిల్పారామం, రహదారుల అభివృద్ధి, వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తదితరాలతో పాటు.. భారాస సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి నేతల అసంతృప్తి, భూకబ్జాల ఆరోపణలు వంటివి ప్రతికూలతలుగా ఉన్నాయి.
 
2012 ఉప ఎన్నికలో ఇక్కడ భాజపా అభ్యర్థిగా విజయం సాధించిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తిరిగి వివరిస్తున్నారు. భారాస, భాజపా ఒక్కటే అంటూ మైనారిటీల, పలు సామాజిక వర్గాల ముఖ్యులతో చర్చలు జరుపుతూ వారి ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి వ్యతిరేక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలా చేయడంలో విజయం సాధించారు.
 
స్పేస్ టెక్నాలజీ సంస్థ 'ఏఈఆర్‌సీ'లో డైరెక్టర్ అయిన మిథున్ రెడ్డి.. తన తండ్రి జితేందర్ రెడ్డికి ఉన్న గుర్తింపు, పార్టీకి ఉన్న ఆదరణతో అన్ని సామాజిక వర్గాల ఓట్లపై దృష్టిపెట్టారు. ప్రధానంగా యువత మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవలే మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్పీ వెంకటేశ్ వంటి ముఖ్య నేతలు బీజేపీని వీడడం కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.
 
సగానికి పైగా యువ ఓటర్లే
ఈ నియోజకవర్గంలో ఓటర్లు 2,52,678
పురుషులు: 1,26,151
మహిళలు: 1,26,514
యువ ఓటర్లు: 1,28,944 (51 శాతం)
 
ప్రభావిత వర్గాలు : బీసీలు, మైనారిటీలు
 
మండలాలు: మహబూబ్ నగర్ అర్బన్, మహబూబ్ నగర్ గ్రామీణం, హన్వాడ
 
గత ఎన్నికల ఫలితాల్లో ఓట్లు ఇలా..
భారాస - వి.శ్రీనివాస్ గౌడ్: 86,474
తెదేపా - ఎం. చంద్రశేఖర్: 28,699
బీఎస్పీ - సయ్యద్ ఇబ్రహీం: 21,664 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్ళు.. తప్పిన ఘోర ప్రమాదం