Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది: కేసీఆర్‌

Advertiesment
కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది: కేసీఆర్‌
, శుక్రవారం, 3 జనవరి 2020 (05:15 IST)
మంచిని కాపాడ్డం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పుకాదని, కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. ప్రజా స్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుందని, ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్నిపనులు చేయాల్సి వస్తుందని అన్నారు.

సమాజానికి మంచిజరుగుతుందని అనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదని కేసీఆర్‌ అన్నారు. విద్యాసంస్ధల్లో పిల్లలకు మంచి విద్యాబోధన చేయడం ద్వారానే నైతిక విలువలు పెంపొందించ వచ్చని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. దీని కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను బోధించాలని భావిస్తున్నామని అన్నారు.

ఇందు కోసం అవసరమైన పాఠ్యాంశాలను తయారు చేయాలని, మాజీ డీజీపీలతో ఒక కమిటి వేస్తామని, జీయర్‌ స్వామి వంటి ఆధ్యాత్మిక, ధార్మిక వేత్తల సలహాలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంచి సమాజం నిర్మించేందుకు అవసరమైన బోధనలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం.

తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తమ విలువైన భాగస్వామ్యం అందించాలని సీఎం కేసీఆర్‌ కోరారు. మాజీ డీజీపీ హెచ్‌జె దొర తన ఆటోబయోగ్రఫీగా రాసిన ‘ జర్నీ థ్రూ టర్బులెంట్‌ టైమ్స్‌’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో గురువారం ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందిచే విధంగా విద్యా విధానం ఉండాలని, మంచి సమాజం నిర్మించే క్రమంలో జీయర్‌ స్వామి లాంటి ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామని అన్నారు. మాజీ డీజీపీ దొర తన సర్వీసు కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ ఇతర పోలీసు అధికారులకు స్పూర్తినిచ్చేలా ఈ పుస్తకం రాశారు.

పుస్తక రచయితను, ప్రచురణ కర్తలను ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ దొరను మనసారా అభినందించారు. దురదృష్టవశాత్తూ సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతున్నది. కొన్నిచోట్ల మనుషులు మృగాల్లా మారుతున్నారు. నేర ప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. విద్యాసంస్థల్లో పిల్లలకు మంచి విద్యాబోధన చేయడం ద్వారానే నైతిక విలువలు పెంపొందించ వచ్చని అన్నారు.
 
డీజీపీ మహేందర్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పోలీసులు సామాజిక రుగ్మతలు తొలగించే విషయంలో ఎంతో కృషి చేస్తున్నారు. కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో అనేక కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. గుడుంబా నిర్మూలనలో, పేకాట క్లబ్లుల మూసివేతలో, బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో, హరితహారం ద్వారా చెట్లుపెంచడంలో ఎంతో కృషి చేశారు.

ఇదే విధంగా తెలంగాణ రాష్ర్టాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా పోలీసులు తమ వంతు పాత్ర పోషించాలి. ఈ సంవత్సరమే సంపూర్ణ అక్షరాస్యత సాధించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతోంది. అందులో పోలీసులు భాగస్వాములై విజయవంతం చేయాలి. చదువుకోలేని వారందరినీ అక్షరాస్యులుగా మార్చే ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
 
హెచ్‌జె దొర తన తనుభవాన్నంతా రంగరించి మంచి పుస్తకం రాశారు. టీమ్‌ వర్క్‌తో ఎలా విజయం సాధించ వచ్చో , క్లిష్టమైన సమయాల్లో వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో, నేరాలను అదుపు చేయడంలో ఎలాంటి పద్దతులు అవలంభించాలో , ఉన్న వనరులతో ఎంత సమర్ధవంతంగా పని చేయవచ్చో దొర అనుభవం ద్వారా నేర్పారు.

వాటన్నింటినీ స్పూర్తిగా తీసుకుని పోలీసులు ముందుకు పోవాలని సీఎం అన్నారు. తెలంగాణలో దళితులను విద్యావంతులను చేయడానికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎంతో కష్టపడుతున్నారు. దళితులను ఉన్నతస్ధాయికి తీసుకుపోవాలనే ప్రవీణ్‌ సంకల్పానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
 
పుస్తక రచయిత హెచ్‌జె దొర మాట్లాడుతూ.. పోలీసులు ఎప్పుడూ తాము హెల్ప్‌లెస్‌ అనే భావనకు గురికావద్దని, ఉన్న వనరులను సమర్ధవంతంగా వాడుకోవాలని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలో ఎన్నో ప్రజోపయోగ పనులు జరుగుతున్నాయని అన్నారు.

కాళేశ్వరం, రెసిడెన్షియల్‌స్కూల్స్‌, ప్రజావైద్యం మెరుగుదల, చెరువుల పునరుద్దరణ పనులు తెంగాణ రాష్ర్టానికి గొప్ప సంపదగా మిగులుతాయని అన్నారు.
 
తమిళనాడు మాజీ గవర్నర్‌ పీఎస్‌రామ్మోహన్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఎంచుకున్న శాంతియుత పంథా వల్లనే తెలంగాణ ఏర్పడిందన్నారు. 1969 ఉద్యమం హింసాత్మకం కావడం వల్లవిజయవంతం కాలేదన్నారు. 2001లో వచ్చిన ఉద్యమం నిలబడి , విజయం సాధించడం , అహింసామార్గం వల్లనే సాధ్యమైందన్నారు.

తెలంగాణలో కేసీఆర్‌ పోలీసుశాఖకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. దీని వల్ల శాంతి భద్రతల పర్యవేక్షణ సులభతరం అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీలు రొట్టం ప్రభాకర రావు, సీబీఐ మాజీ డైరెక్టర్‌ విజయరామారావు, రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా మాట్లాడారు.

కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభన్‌, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకిమాధవరావు, దొర గురువు ఆర్వీఆర్‌ చంద్రశేకర్‌రావు, సీనియర్‌ పాత్రికేయులు ఐ. వెంకట్‌రావు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి అంతా గ్రాఫిక్స్... అదే చంద్రబాబు చేసిన అభివృద్ధి : విజయసాయి రెడ్డి