సీఎం కేసీఆర్ అహంకారం దించేందుకే పాదయాత్ర చేస్తున్నాని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఒక చరిత్ర అని తెలిపారు.
ఇదే చేవెళ్ల గడ్డ నుంచి 18 ఏళ్ల క్రితం తొలి అడుగు పడిందని గుర్తుచేశారు. ప్రతి పల్లెకు వస్తా.. వారితో మమేకం అవుతానని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతానికే ఈ పాదయాత్ర చేస్తున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతిని బయట పెడతానని హెచ్చరించారు. కేసీఆర్‌కు అమ్ముడుపోయిన కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతానని ప్రకటించారు. దేశంలోనే నెంబర్ వన్ అధ్వాన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని షర్మిల దుయ్యబట్టారు.
వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కళ్లముందు 1.90లక్షల ఉద్యోగాలు కనిపించినా నోటిఫికేషన్లు రావు. నిరుద్యోగులు హమాలీలుగా మారారు. ఏడేళ్లలో 30 వేల ఉద్యోగాలు పీకేశారు. తెలంగాణలో 800 శాతం దళితులపై దాడులు జరిగాయి.
మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. దమ్ముంటే కేసీఆర్ బీసీలకు ఏం చేశారో చెప్పాలి. నిజంగా సమస్యలు లేకుంటే నా ముక్కు నేలకు రాస్తా. సమస్యలుంటే రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలి అని షర్మిల డిమాండ్ చేశారు