భార్యపై అనుమానం పెంచుకున్న ఓ కసాయి భర్త... 8 నెలల పసిబిడ్డ ప్రాణాలు తీశాడు. బాబు నాకు పుట్టలేదు.. నీవు వివాహేతర సంబంధం పెట్టుకున్నావు... వాడికే వీడు పుట్టాడు అంటూ... వేధించి, భార్యతో గొడవ పెట్టుకుని ఆ చిన్నారి ప్రాణం తీశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తొండుపల్లిలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శంషాబాద్ పట్టణానికి చెందిన ఇప్పునూతన స్పందన అనే యువతిని ఐదేండ్ల కిందట తొండుపల్లి గ్రామానికి చెందిన గంద్రం విక్రమ్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.
రెండేండ్ల నుంచి వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. పిల్లలు పుట్టడంలేదని భార్యను వేధిస్తూ వస్తున్నాడు. 8 నెలల కిందట వారికి హార్దిక్ పుట్టాడు. అప్పటి నుంచి విక్రమ్ మద్యానికి బానిసగా మారాడు. 'బాబు నాకు పుట్టలేదు. నీకు వివాహేతర సంబంధం పెట్టుకున్నావు' అంటూ భార్యతో గొడవపడసాగాడు.
ఈ క్రమంలో మంగళవారం మళ్లీ స్పందనతో ఘర్షణపడ్డాడు. నిద్రలో ఉన్న కొడుకు హార్దిక్‌ను ఇంటిముందు ఉన్న నీటిసంపులో పడేసి పైకప్పు పెట్టాడు. తర్వాత టీ తాగేందుకువెళ్లి గ్రామానికి చెందిన స్నేహితుడితో విషయాన్ని చెప్పాడు. అతడు వెంటనే విక్రమ్‌తో కలిసి వచ్చి నీటిసంపులో చూడగా.. హార్దిక్ నీటిపై తేలియాడుతూ కనిపించాడు. దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.