తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభం కోసం ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వేసవి సెలవులు పొడిగింపు లేదని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65లక్షల మంది పిల్లలకు మంత్రి స్వాగతం పలికారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా 9వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు జరుగుతాయని వెల్లడించారు.
ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని మంత్రి తెలిపారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని వెల్లడించారు. అందుకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు.