పోలీస్ స్టేషన్‌లో శాంతిపూజలు నిర్వహించిన ఘటన కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ శాంతిపూజలు జరిగాయి. ఇందుకు అపశకునాలే కారణమట.
ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అర్చకులు ఈ శాంతి పూజలు జరిపించారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని వారాలుగా కేసుల సంఖ్య బాగా పెరిగిందట. అందులో పోలీసులకు ఇబ్బందిగా మారే కేసులు ఎక్కువగా ఉన్నాయట.
అంతేగాకుండా.. గత శుక్రవారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ పాముకాటు వేసింది. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఈ వరుస ఘటనల్ని గమనించిన తర్వాత.. శాంతి పూజ చేస్తే సమస్యలు తొలగుతాయని కొందరు చెప్పడంతో.. పోలీస్ సిబ్బంది శాంతి పూజలు నిర్వహించారని చెబుతున్నారు.