తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో యువత ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు తెగ తాగేస్తున్నారు. నగరంలో ప్రతి నిత్యం సగటున 6 లక్షల బీర్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఈ కారణంగా గత 17 రోజుల్లో కోటి బీర్లు అమ్ముడుపోయాయి.
ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 8,46,175 కేస్‌ల (ఒక కేస్‌లో 12 బీర్లు ఉంటాయి) బీర్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయిలో విక్రయాలు నమోదవుతున్నాయి.
నెలకు సగటున లక్ష చొప్పున బీరు కేసుల విక్రయాలు అధికంగా నమోదు కావడం గమనార్హం. సాధారణంగా విస్కీ, బ్రాంది తదితర అలవాటున్న వ్యక్తులు సైతం ఎండల ప్రతాపంతో బీరు వైపు చూస్తున్నారు. ఆబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌లో గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో రోజూ సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నాయి.
గత జనవరి నెలలో హైదరాబాద్ నగరంలో 296619 బీర్లు, రంగారెడ్డిలో 836907, మేడ్చల్‌లో 134468 బీర్లు చొప్పున తాగేశారు. అదే ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌లో 331784, రంగారెడ్డిలో 934452, మేడ్చల్‌లో 146763, మార్చి నెలలో 368569, రంగారెడ్డిలో 1077240, మేడ్చల్‌లో 163358, ఏప్రిల్ నెలలో 194351, రంగారెడ్డిలో 559745, మేడ్చల్‌లో 92078 చొప్పున బీర్లు తాగేశారు.