ఇల్లాలికి ఇస్త్రీ పెట్టెతో వాతలు-పోలీసులు అదుపులో శాడిస్ట్ భర్త..! ఏం జరిగింది?
ఇల్లాలికి ఇస్త్రీ పెట్టెతో వాతలు పెట్టాడు ఆ కిరాతక భర్త. వేడి చేసిన ఇస్త్రీ పెట్టెను తలపై, ఒంటిపై పెట్టి కాల్చాడు. ఒళ్లంతా కాలుతున్న గాయాలతో విలవిలలాడే భార్యను చూసి రాక్షసానందం పొందాడు ఆ దుర్మార్గుడు. శాడిస్ట్ భర్త అరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది
ఇల్లాలికి ఇస్త్రీ పెట్టెతో వాతలు పెట్టాడు ఆ కిరాతక భర్త. వేడి చేసిన ఇస్త్రీ పెట్టెను తలపై, ఒంటిపై పెట్టి కాల్చాడు. ఒళ్లంతా కాలుతున్న గాయాలతో విలవిలలాడే భార్యను చూసి రాక్షసానందం పొందాడు ఆ దుర్మార్గుడు. శాడిస్ట్ భర్త అరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ అభాగ్యురాలు. ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా..? ఆమె పేరు జ్ఞానజ్యోతి. హైదరాబాద్ టోలిచౌకీ కాకతీయనగర్ ప్రాంతంలో నివాసముండే ప్రశాంత్ కుమార్‌తో 2012 మే 11వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.
వరకట్న లాంఛనాలిచ్చి ఘనంగా వివాహం చేశారు జ్ఞానజ్యోతి తల్లిదండ్రులు. కొంతకాలం అన్యోన్యంగానే కాపురం సాగడంతో వీరికో పాప పుట్టింది. మళ్లీ ఇప్పుడు జ్ఞానజ్యోతి ఆర్నెల్ల గర్భిణీ. పెళ్లైన ఏడాది వరకు బాగానే ఉన్నా ప్రశాంత్ కుమార్ అత్తింటి డబ్బుపై ఆశపడ్డాడు. మీ పుట్టింటికెళ్లి డబ్బు తెమ్మంటూ నిత్యం తన భార్య జ్ఞానజ్యోతిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు ప్రశాంత్ కుమార్. గతంలో కూడా వెయిట్ లిఫ్టింగ్ చేసే రాళ్లతో కొట్టేవాడని వాపోతుంది అతని భార్య జ్ఞానజ్యోతి.
ఉద్యోగం చేయకుండా ఆవారాగా తిరిగేవాడు ప్రశాంత్ కుమార్. జ్ఞానజ్యోతి పెట్లబురుజులోని ప్రభుత్వ మెటర్నటీ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేది. తన జీతం డబ్బు కూడా అతనే ఖర్చు పెట్టుకునేవాడని చెప్తోంది. తన తల్లి రిటైర్మెంట్ కాగా.. ఆ డబ్బు తెమ్మని వేధించేవాడని వాపోయింది. డబ్బు తేవడం లేదనే భార్యపై కోపం పెంచుకున్నాడతను. నిన్న పగలంతా ఇస్త్రీ పెట్టెను వేడి చేస్తూ వాతలు పెట్టిన భర్త.. రాత్రి భార్యను డ్యూటీకి పంపడానికి ఆసుపత్రి దగ్గర దిగబెట్టి వెళ్లాడు.
ఆమె చేతిలో సెల్ ఫోన్ ఉంటే తన పుట్టింటివారికి చెప్తుందనే ఉద్దేశంతో సెల్ ఫోన్ కూడా లాక్కున్నాడు. ఆసుపత్రిలోని సిబ్బంది గమనించి జ్ఞానజ్యోతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో బాధితులు లంగర్ హౌస్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భర్త ప్రశాంత్ కుమార్‌తో పాటు.. బావ ప్రమోద్, అత్త సంధ్యాదేవిలు వేధింపులకు గురి చేసేవారని వాపోయారు బాధితులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్త ప్రశాంత్ కుమార్‌ని లంగర్ హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రశాంత్ కుమార్ పైన ఐపీసీ 307, 498 ఏ, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అత్తింటివారు కూడా వేధింపులకు గురి చేసి ఉంటే వారిని కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు.