తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఒకటి అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.
జువ్వాడి నుంచి కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగే వివాహానికి కొందరు ట్రాక్టర్‌లో పెళ్లి సామగ్రితో తీసుకెళ్తున్నారు. కృష్ణాజివాడి వద్దకు రాగానే ట్రాక్టర్‌ను వెనుక నుంచి అమిత వేగంగా వచ్చిన లారీ ఒకటి ట్రాక్టర్ ఢీకొట్టంది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టరులో 16 మంది ఉన్నారు. వీరంతా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. దవాఖానాలో చికిత్స పొందుతూ కాశవ్వ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో వివాహం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.