పాకిస్థాన్‌లోని సుక్కూర్ జిల్లా దక్షిణ సింద్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఘటనాస్థలంలోనే 13 మంది దుర్మరణం చెందగా.. 32 మందికిపైగా గాయాలయ్యాయి.
బస్సు ముల్తాన్ నుంచి కరాచీకి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సును క్రేన్ సాయంతో పైకి ఎత్తి వాహనంలో చిక్కుకుపోయిన వారిని అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సుక్కూర్ సివిల్ హాస్పటల్, పాలోఅకిల్ తాలూక హాస్పటళ్లకు తరలించారు.
గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారిని తరలిస్తున్న నేపథ్యంలో సుక్కూర్, రోహిర్ దవాఖానల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.