Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్‌ను గద్దె దించాలి: రేవంత్... మోదీ చౌకీదారు కాదు: రాహుల్ గాంధీ

Advertiesment
కేసీఆర్‌ను గద్దె దించాలి: రేవంత్... మోదీ చౌకీదారు కాదు: రాహుల్ గాంధీ
, శనివారం, 20 అక్టోబరు 2018 (18:19 IST)
కేసీఆర్ ధన బలం కంటే కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యం గొప్పదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ ముఖ్యనేతలు హాజరై మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి ముందుగా రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లుగా నియంత పాలన సాగిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 
 
నియంత కేసీఆర్ ప్రజాస్వామికవాదులంతా కలసి గద్దె దించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 80 వేల పుస్తకాలు చదివిన అంటున్న కేసీఆర్.. గాంధీ కుటుంబం చరిత్ర చదవనట్టుందని రేవంత్ ఎద్దేవా చేశారు. నెహ్రు అధికారంలో ఉండగా... ఇందిరాగాంధీ గానీ, ఇందిరా గాంధీ అధికారంలో ఉండగా రాజీవ్ గాంధీ గానీ రాజకీయాల్లోకి రాలేదని గుర్తు చేశారు. కానీ రాష్ట్రంలో నాలుగున్నరేళ్లు పాలించిన కేసీఆర్ తన కుటుంబసభ్యులందరికీ పదవులిచ్చి అవినీతిని పెంచి పోషించారని విమర్శించారు. 
 
రానున్న ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నియంత కేసీఆర్‌ను ఇంటికి సాగనంపాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ సభ సందర్భంగా ఇక్కడి మన్యం వీరుడు కొమ్రం భీంను గుర్తుచేసుకోవాలని అనడంతో సభికుల నుంచి పెద్ద ఎత్తున  హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దేశమంతా అంబేద్కర్ బాటలో నడుస్తుంటే ఇక్కడ కేసీఆర్‌కు అంబేద్కర్ నచ్చలేదని అందుకే ప్రాణిహిత ప్రాజెక్టుకు పెట్టిన అంబేద్కర్ పేరును తీసేసి కాళేశ్వరం పేరుపెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సీఎం అనుచరులకు, కాంట్రాక్టర్లకు వేల కోట్లు కట్టబెట్టేందుకే ఇందిరా సాగర్ ప్రాజెక్టు అంచనాలను లక్షకోట్లకు పెంచారన్నారు. 
 
ఢిల్లీలో ప్రధాని మోదీ, తెలంగాణలో కేసీఆర్ ఆదివాసులకు భూమి మీద హక్కు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆదివాసుల కోసం ప్రత్యేక బిల్లు తేవటంతోపాటుగా రైతులకు రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని హామీనిచ్చారు. దళితులకు ఇస్తానన్నా మూడెకరాల భూమి ఎవరికైనా వచ్చిందా? డబుల్ బెడ్రూం వచ్చిందా ? 12 శాతం రేజర్వేషన్ వచ్చిందా? ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు వచ్చాయా ? మోదీ వేస్తా అన్న 15 వేలు మీ అకౌంట్లో పడ్డాయా..? అని సభికులను ప్రశ్నించగా వారి నుంచి లేదని సమాధానం వచ్చింది. పదేళ్ల యుపిఏ ప్రభుత్వం పేదల కోసం పనిచేసిందని, మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు మాత్రమే పనిచేస్తోందన్నారు. 
webdunia
 
మోదీ దేశ ప్రజలకు కాపలాదారు కాదని, నీరవ్ మోదీకి.. విజయ్ మాల్య లాంటి వారికి మాత్రమే కాపలాదారని ఎద్దేవా చేశారు. మోదీ చోకీ దార్ కాదని చోరీ దార్ అని (రక్షకుడు కాదు భక్షకుడు) అని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని హామీనిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ తీరుస్తుందని రాహుల్ స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెంటల్ భర్త వద్దకు వెళ్లాలని ఒత్తిడి... పిల్లలకి కరెంట్ షాకిచ్చి చంపేసి తను కూడా...