తెలంగాణ రాష్ట్రంలో గత నెలరోజులకు పైగా చేస్తున్నఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు నిన్న సూచించిన.. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ ప్రతిపాదనకు ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది.
పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీ ప్రస్తావన లేదని ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున లేబర్ కోర్టుకు వెళ్లలేదని ప్రభుత్వం నివేదించింది. తుదపరి చర్యలు చేపట్టేలా కార్మికశాఖ కమిషనర్‌ను ఆదేశించాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసే అధికారం హైకోర్టుకు ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఎస్మా ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని ఏజీ వాదించారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్-3 ప్రకారం టీఎస్ ఆర్టీసీని ఏర్పాటు చేశామని ఏజీ వివరించారు.
సెక్షన్-47 ప్రకారం కేంద్రం అనుమతి లేదు కదా? అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తప్పనిసరి కాదని, రోడ్డు రవాణాపై రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని ఏజీ వాదనలు వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్టీసీ చట్టం కేంద్ర చట్టంలో భాగమే, కేంద్రం అనుమతులు అవసరమేనని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
తెలంగాణలో ప్రజాస్వామ్యం గాయబ్ : చాడ
తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడుడ చాడ వెంకటరరెడ్డి అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడడిన ఆయన విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం పాలన సాగుతుందని విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలతో సీఎం కేసీఆర్ ప్రజలు, ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలు ఎన్నుకున్న కేసీఆర్.. ఆ ప్రజలను ఎందుకు కలవరని ప్రశ్నించారు. కేసీఆర్ మొండి వైఖరి, అహంకారమే ఆర్టీసీ సమ్మెకు కారణమని అన్నారు. సీఎం వైఖరి కారణంగా 27మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూ ప్రక్షాళనతో ఏం సాధించారని చాడ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన పత్రికలో వచ్చిన కథనాలే రెవెన్యూ ఉద్యోగులపై దాడులకు కారణమని ఆరోపించారు.