తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపొందే దిశగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అలాగే అత్యంత కీలకమైన బాధ్యతలను తన కుమారుడు, మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. పార్టీ గెలుపు అసాధ్యమనే నియోజక వర్గాలపై కేటీఆర్ దృష్టి సారించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇంకా సెటిలర్లు ప్రభావితం చేసే నియోజకవర్గాల బాధ్యతలు కేటీఆర్‌కు కట్టబెట్టారు.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోని కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఇంకా అంతర్గత విభేదాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న నియోజకవర్గాల బాధ్యతలు కూడా కేటీఆర్ భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో కనీసం 15 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే సెటిలర్ల వ్యవహారాన్ని కేటీఆర్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. సెటిలర్లుండే నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి.. ఏపీ సీఎం చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు గులాబీదళం పక్కా స్కెచ్ వేస్తోంది.