శ్రీరెడ్డి పోరాటం ఫలించింది... తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ

బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:09 IST)
తెలుగు సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్యానల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. సంబంధిత ప్యానల్ ఏర్పాటు కోసం ఒక జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
 
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 984 ప్రకారం ఈ కమిటీలో సినీనటి సుప్రియ, సినీనటి - యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను టాలీవుడ్‌ ప్రతినిధులుగా నియమించింది. నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మిలతో ఈ కమిటీ ఏర్పాటైంది.
 
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత సుధాకర్ రెడ్డి కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. రామ్మోహన్ రావు ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు నిర్భయంగా చెప్పవచ్చని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం స్పూన్‌ను మింగేసి కొద్దిరోజులు కడుపులోనే ఉంచుకుంది... తర్వాత ఏమైందంటే?