ప్రేమించే సమయంలో మాత్రం ఎలాంటి కట్నకానులు లేకుండానే పెళ్లి చేసుకుంటానని నమ్మించి చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఓ యువకుడు.. పెళ్లి మాటెత్తగానే భారీగా కట్నకానుకలతో పాటు.. స్కూటర్ కావాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన యువతి.. బలవన్మరాణానికి పాల్పడింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్ జిల్లా గాంధారి మండల పరిధిలోని మాధవపల్లి గ్రామానికి చెందిన యువతి రాయల సౌందర్య(21) అనే యువతి బంధువైన లింగంపేట్ మండలం కొర్పోల్ గ్రామానికి చెందిర కర్రెల్లో స్వామిని గత రెండేళ్లుగా ప్రేమిస్తూ వచ్చింది.
వీరి ప్రేమ విషయం తెలిసిన పెద్దలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. పెళ్లి నిశ్చయించిన కొన్ని రోజుల తర్వాత ప్రియుడు స్వామి అదనంగా రూ.2 లక్షలతో పాటు బైక్ ఇప్పించాలని సౌందర్యను వేధించసాగాడు. పెద్దలు నిర్ణయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. అదనపు కట్నం తెస్తేనే పెళ్లి చేసుకుంటానని లేదంటే వేరే అమ్మాయిని చూసుకుంటానని స్వామి తేగిసి చెప్పాడు.
ఈ క్రమంలో గత నెల 18న సౌందర్య ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ప్రియుడు స్వామితో వీడియో కాల్‌లో మాట్లాడింది. తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి కోరింది. ప్రియుడు నిరాకరించడంతో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది.
గాంధారిలోనే ఉన్న స్వామి వెంటనే సౌందర్య ఇంటికి చేరుకొని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వెళ్లి పోయాడు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఈ నెల2న నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.