తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మొత్తం ఆరు జల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రంలోని ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, రాగల 24 గంటల్లో రుతుపవనాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది.
హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సమయంలో గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల మేరకు ఉపరితల గాలులు విస్తాయని వెల్లడించింది. వచ్చే 24 నుంచి 48 గంటల్లో రుతుపవనాలు మొత్తం రాష్ట్రానికి విస్తరిస్తాయని, ప్రస్తుతం తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షపు జల్లులు కురుస్తాయని ఐఎండీ సీనియర్ అదికారు ఒకరు వెల్లడించారు.
ఇకపోతే, గురువారం హైదరాబాద్ నగరంలోని బాలానగర్, కూకట్ పల్లి, చింతల్, మాదాపూర్, బేగంపేట్, ఎల్బీ నగర్, ఘట్‌కేసర్, కీసర, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసిందని తెలిపారు. గచ్చిబౌలిలో 2 మిల్లీ మీటర్లు, మాదాపూర్‌లో 1.5 మిమీ, ఖాజీపేటలో 1.2 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది.