లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం పరిసరాల్లో పలు సూచనలు చేశారు. లష్కర్ బోనాలకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి తొలిబోనం సమర్పించడం జరుగుతుందని తెలిపారు. బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తుంటారని.. వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సీఎం కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తు చేశారు.
నాటి నుంచి సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఏడాది సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తూ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఇంకా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని వెల్లడించారు.