Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీకి మంత్రి హరీష్ రావు 18 ప్రశ్నస్ర్తాలు

Advertiesment
బీజేపీకి మంత్రి హరీష్ రావు 18 ప్రశ్నస్ర్తాలు
, సోమవారం, 2 నవంబరు 2020 (07:21 IST)
దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో హాట్ టాపిక్ అవుతున్నారు.

ఇదివరకే మంత్రి హరీష్ రావుకు బీజేపీ నేతలు పలువురు సవాళ్లు విసిరారు. ఇందుకు స్పందించిన మంత్రి స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇచ్చారు. తాజాగా.. 18 ప్రశ్నలతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు బహిరంగ లేఖ మంత్రి హరీష్ లేఖ రాశారు. ఆ లేఖ యధాతథంగా..
 
సంజయ్ గారు నమస్కారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేయవచ్చు. ప్రచారం చేయవచ్చు. ఓట్లు అడగవచ్చు. ఆ హక్కును ఎవరూ ప్రశ్నించలేరు. కానీ రాజకీయాల్లో హక్కులతో పాటు బాధ్యతలుంటాయి.

ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు పాటించే నైతిక విలువల మీద ఆధారపడి ఉంటుంది. బిజెపి నాయకులకు అలాంటి నైతిక విలువలు ఏమైనా ఉన్నాయా? అని నేడు తెలంగాణ సమాజం అడుగుతున్నది.  
 
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి గడిచిన ఆరేళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తూనే ఉన్నది. ప్రతీ అంశంలోనూ వివక్ష చూపుతూనే ఉన్నది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగానూ సహకరించకపోగా, అప్పటికే మంజూరైన అనేక ప్రాజెక్టులను రద్దు చేసి తీరని అన్యాయం చేసింది.

ఇంత అన్యాయం చేసిన బిజెపికి మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు ఉన్నదా? తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్న మీకు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటెయ్యాలి? మీకు అన్యాయం చేస్తూనే ఉంటాం, మీ పొట్టలు కొడుతూనే ఉంటాం, కానీ మీరు మాత్రం మా పల్లకీ మోయాలి అనే విధంగా మీ వైఖరి ఉంది.  
 
దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా మీరు, మీ పార్టీ నాయకులు ప్రజలను మభ్య పెట్టడానికి అనేక విషయాలు చెబుతున్నారు. నేను తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున 18 ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతున్నాను. దయచేసి వీటికి సమాధానం చెప్పి, మీ నైతికతను నిరూపించుకోవాలని కోరుతున్నాను.

మీ నుంచి సమాధానం, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి పరిష్కారం ఆశించి నేను మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. విజ్ఞతతో ఆలోచించి, ఓ తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ప్రజాప్రతినిధిగా స్పందించాలని కోరుతున్నాను. 
 
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో అప్పటి పది జిల్లాల సరిహద్దులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాగానే ఆ చట్టానికి తూట్లు పొడిచి, ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. కనీసం తెలంగాణ రాష్ట్రానికి సమాచారం కూడా ఇవ్వలేదు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఏడు మండలాలను వేరే రాష్ట్రంలో కలపడం మీరు చేసిన అన్యాయం కాదా?
 
2. తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమైన 460 మెగావాట్ల లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్లాంటును బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అప్పగించింది. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేసే సీలేరు ప్లాంటు పోవడం వల్ల తెలంగాణకు ప్రతీ ఏడాది రూ.500 కోట్ల నష్టం వస్తున్నది. సీలేరు ప్లాంటును తెలంగాణకు కాకుండా చేయడం మీరు చేసిన ద్రోహం కాదా? ఏటా 500 కోట్ల నష్టం వస్తున్నా, దానికి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకపోవడం మీరు చేసిన దారుణమైన అన్యాయం కాదా?
 
 
3. వరంగల్ – ఖమ్మం జిల్లాల సరిహద్దులో పెద్ద ఎత్తున ఇనుప ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. సమైక్య పాలకులు బయ్యారం గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంటే తెలంగాణ ప్రజలు ఉద్యమించి అడ్డుకున్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడితే, కోయ – గిరిజన యువకులకు ఉపాధి దొరుకుతుంది.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని హామీ ఇచ్చారు. చట్టం ప్రకారం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు. అలాంటి బయ్యారం గనులను ఉపయోగించి స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టడం లేదు? విభజన చట్టాన్ని బిజెపి ప్రభుత్వం ఎందుకు విస్మరించింది? ఇది మీరు తెలంగాణ ప్రజలకు చేసిన  మోసం కాదా?
 
4. కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ నగరం చుట్టు పక్కల ఐటి క్లస్టర్ల ఏర్పాటుకు, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ల స్థాపనకు ఉపయోగపడే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టుమెంటు రీజియన్ (ఐటిఐఆర్)ను మంజూరు చేసింది. 50 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఐటిఐఆర్ ద్వారా 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా, 15 లక్షల మందికి ఉపాధి కల్పించేలా క్లస్టర్లు, యూనిట్ల స్థాపనకు ప్రణాళిక సిద్ధం అయింది.

కానీ 2014లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ కు మంజూరైన ఐటిఐఆర్ ప్రాజెక్టును ఉపసంహరించుకున్నారు. గుజరాత్ లో గిఫ్ట్ సిటీ పేరున గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇచ్చింది. ఢిల్లీ-ముంబాయి ఇండస్ట్రియల్ కారిడార్ కు నిధులు ఇచ్చింది. మరి హైదరాబాద్ ఐటిఐఆర్ ప్రాజెక్టును ఎందుకు రద్దు చేసింది? ఇది మీరు తెలంగాణను ఆర్థికంగా తీసిన దెబ్బకాదా? 
 
5. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని ఎప్పటి నుంచో వరంగల్ జిల్లా ప్రజలు ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల్లో బిజెపి కూడా పాల్గొన్నది. యుపిఏ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని మాటిచ్చింది. కేంద్రం కోరిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట సమీపంలో వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూమిని గుర్తించింది.

కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాజీపేటకు మంజూరైన వ్యాగన్ ఫ్యాక్టరీని రద్దు చేసింది. వ్యాగన్ ఫ్యాక్టరీ లాంటి పెద్ద పరిశ్రమ రావడం వల్ల వరంగల్ ప్రాంతంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చేవి. అలాంటి బృహత్తర ఫ్యాక్టరీని ఎందుకు రద్దు చేశారు? ఇది మీరు తెలంగాణకు చేసిన అన్యాయం కాదా?
 
6. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ విషయంలో అన్యాయం జరిగిందనే ఆవేదనతో. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య విధానాల ఫలితంగా నీళ్లను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతున్నాం.

దేశంలో ఎప్పుడైనా సరే కొత్త రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రానికి నదీ జలాల్లో కేటాయింపులు జరపాలని చట్టం చెబుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు దాటి ఏడేళ్లు వచ్చినా ఇంత వరకు నీటి కేటాయింపులు ఎందుకు చేయలేదు? నీటి కేటాయింపులు చేయకుండా ప్రాజెక్టుల విషయంలో తలెత్తే అభ్యంతరాలను ప్రోత్సహిస్తున్నారు.  ఇది మీ కపట నీతికి, మీ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? 
 
7. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. కనీసం ఒక్క ప్రాజెక్టునయినా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఆర్థిక సహాయం చేయాలని ఎన్నో సార్లు కోరాము. తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా? ఎందుకు తెలంగాణ పట్ల విద్వేషంతో వ్యవహరిస్తున్నారు? 
 
 
8. నీతి ఆయోగ్ కు స్వయంగా ప్రధాన మంత్రే అధ్యక్షుడు. తెలంగాణలో సాగునీటి వనరుల అభివృద్దికి మిషన్ కాకతీయ, మంచినీటి వసతి కల్పనకు మిషన్ భగీరథ గొప్పగా అమలు చేస్తున్నారని నీతి ఆయోగ్ కితాబునిచ్చింది. ఇవి దేశానికే గర్వకారణమైన కార్యక్రమాలు కాబట్టి, మిషన్ భగీరథకు 19వేల కోట్లు, మిషన్ కాకతీయకు 5వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం సాయంగా అందించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది.

స్వయంగా ప్రధాన మంత్రి అధ్యక్షత వహించే నీతి ఆయోగ్ మొత్తం 24 వేల కోట్ల రూపాయలు సిఫారసు చేసినా బిజెపి ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథను స్వయంగా ప్రధాన మంత్రే ప్రారంభించారు. కానీ ఆయన అధ్యక్షతన ఉండే నీతి ఆయోగ్ సిఫారసులను అమలు చేయలేదు. ఇది నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే బిజెపి విధానం కాదా? 
 
9. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇంకా ఆంధ్రకు చెందిన 1153 మంది విద్యుత్ ఉద్యోగులు రాష్ట్రంలోనే పనిచేస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని వారిని పంపించాలి. కానీ కేంద్రం నాన్చివేత వైఖరి అవలంభించింది. ఫలితంగా ఆరేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఉద్యోగులను భరిస్తున్నది. ఏటా వెయ్యి కోట్ల భారం పడుతున్నది. ఇది కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కాదా?
 
10. తెలంగాణ రాష్ట్రానికి 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవానికి కేవలం 1,300 కిలోమీటర్లకు మాత్రమే నిధులు విడుదల చేసింది. ఇంకా 1,855 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నిధులు ఇవ్వలేదు. పరిపాలనా అనమతులు ఇవ్వలేదు. మంజూరు చేసిన జాతీయ రహదారులకు నిధులు ఆపేయడం, అనుమతులు ఇవ్వకపోవడం తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం కాదా?
 
11. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే 2,016 రూపాయల పెన్షన్ లో 1600 కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నదని అబద్ధాలు ఆడినారు. నిరూపించమని సవాల్ విసిరితే పారిపోయారు. పెన్షన్లలో మీ వాటా కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే. అది కూడా కొద్ది మందికే ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 39.5 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంటే, మీరు కేవలం 6 లక్షల మందికి మాత్రమే రెండు వందల రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్నారు.

మిగతా 33.5 లక్షల మంది పెన్షనర్లకు మీ వాటా ఎందుకు చెల్లించడం లేదు? అందరికీ మీరు 200 రూపాయల చొప్పున ఇస్తే ఏడాదికి కేంద్రం నుంచి రావాల్సింది 948 కోట్ల రూపాయలు. కానీ ఇస్తున్నది 210 కోట్ల రూపాయలు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఏటా 12వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తుంటే, అందులో మీ వాటా కేవలం 210 కోట్ల రూపాయలు మాత్రమే. తెలంగాణలో అర్హులైన అందరికీ కాకుండా తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే పెన్షన్ ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏమిటి? 
 
12. దేశంలో 4 లక్షల కోట్ల వ్యయంతో కొత్తగా వంద ఎయిర్ పోర్టులు నిర్మిస్తామని 2020-21 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వరంగల్ లో నిజాం కాలం నుంచే విమానాశ్రయం ఉంది. సమైక్య పాలనలో అది మూత పడింది. వరంగల్ విమానాశ్రాయాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతున్నది.

కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి, భూ సేకరణకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. దేశంలో వంద కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించే ప్రణాళికలో వరంగల్ విమానాశ్రయం ఎందుకు లేదు? బిజెపి ప్రభుత్వం వరంగల్ విమానాశ్రయాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదు? ఇది చిన్నచూపు కాదా?
 
13. నేషనల్ టెక్నికల్ టెక్స్ టైల్స్ మిషన్ పేరిట, స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్ టైల్స్ పేరిట కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా టెక్స్ టైల్ రంగాభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నది. ఎగుమతులు – ఉత్పత్తి – తయారీ యూనిట్లకు స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించింది.

మరి దేశంలోనే అతి పెద్దదైన టెక్స్ టైల్ పార్కును వరంగల్ లో నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎందుకు ఈ పథకాలను వర్తింపచేయడం లేదు? టెక్స్ టైల్స్ డెవలప్మెంట్ నిధులను తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు? ఇది బిజెపి ప్రభుత్వపు దుర్నీతి కాదా?
 
14. ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు కోరినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు?  
 
15. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఎస్సీలు, ఎస్టీలున్నారు. వారికి సామాజిక న్యాయం జరగాలి. ఎస్సీ వర్గీకరణ చేయాలని, ఎస్టీల రిజర్వేషన్ ను 6 నుంచి 10 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తెలంగాణ శాసన సభ తీర్మానం చేసింది. అయినా సరే, కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. అసెంబ్లీ తీర్మానాన్ని ఎందుకు మూలన పెట్టింది? ఇది బిజెపి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చేస్తున్న అన్యాయం కాదా?
 
16. ప్రతీ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఉండాలనేది మొదటి నుంచీ అమలవుతున్న విధానం. కానీ తెలంగాణ రాష్ట్రంలో 9 మాత్రమే ఉన్నాయి. మిగతా 24 జిల్లాలకు నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని ఎన్ని సార్లు కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణలో విద్యా వసతుల పట్ల ఇది కేంద్రం నిర్లక్ష్యం కాదా? 
 
17. నర్మదా నది ప్రక్షాళన చేయడం ద్వారా అహ్మదాబాద్ నగరాన్ని, గంగా నదిని ప్రక్షాళన చేయడం ద్వారా వారణాసి నగరాన్ని సుందరంగా  తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చింది.

మరి హైదరాబాద్ నగరం మధ్యలోని మూసీ నది ప్రక్షాళన గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? హైదరాబాద్ నుంచి ఎంపిలుగా గెలిచి, కేంద్ర మంత్రులైన వారు ఎందుకు మూసీ ప్రక్షాళనకు నిధులు తేవడం లేదు? ఇది వివక్ష కాదా? మీది చేతగాని తనం కాదా?

18. 13వ ఆర్థిక సంఘం గడువు 2015తో ముగిసింది. 14వ ఆర్థిక సంఘం గడువు 2020 మార్చితో ముగిసింది. కానీ కేంద్రం 13వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా 1,129.93  కోట్ల రూపాయలు ఇవ్వాలి. 14వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా 817.61 కోట్ల రూపాయలు ఇవ్వాలి.

ముగిసిన రెండు ఆర్థిక సంఘాలకు కలిపి 1947.54 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలి. 15వ ఆర్థిక సంఘం కాలం నడుస్తున్నప్పటికీ గడిచిన రెండు ఆర్థిక సంఘాల నిధులను ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. విభజన బిల్లు ప్రకారం తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం ఏటా రూ.450 కోట్ల ఇవ్వాలి.
 
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐజిఎస్టీ  బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. 2017 - 18 ఆర్థిక సంవత్సరం నుండి గడిచిన ఆర్థిక సంవత్సరం వరకు 2856 కోట్ల రూపాయల ఐజిఎస్టీ  బకాయిలను కేంద్రం తెలంగాణ  రాష్ట్రానికి ఇవ్వాలి. ఆ నిధులను ఎందుకు విడుదల చేయడం లేదు? 
  
జిఎస్టీ చట్టం తెచ్చినపుడు రాష్ట్రాలకు అనేక హామీలు ఇచ్చారు. ఆదాయ వృద్ధిరేటు 14 శాతంలోపు ఉంటే పరిహారం చెల్లిస్తామని చట్టంలో స్పష్టంగా  పేర్కొన్నారు. దాని ప్రకారం తెలంగాణకు 5,926 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలి. ఎన్నిసార్లు అడిగినా మభ్యపెట్టే మాటలే తప్ప ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. 
 
మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 12 వేల కోట్ల వరకు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా  రావాల్సిన నిధులను విడుదల చేయకపోవటం వివక్ష కాదా? కేంద్రం  నుంచి రావాల్సిన నిధులను బిజెపి  ప్రభుత్వం నిలిప వేయడం వల్ల తెలంగాణ అభివృద్ధి ప్రణాళికల అమలు ఇబ్బందిగా మారుతున్నది.

దీనికి కేంద్రానికి బాధ్యత కాదా? బిజెపి పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు ఎందుకు అడగడం లేదు? కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు చేసిన, చేస్తున్న అన్యాయాల్లో మచ్చుకు కొన్ని మాత్రమే నేను అడిగాను. వాటికి అంశాల వారీగా సమాధానం చెప్పాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. 

మీరు తెలంగాణ బిడ్డ. బిజెపి నాయకులు అయినప్పటికీ, పుట్టిన గడ్డకు మేలు చేయాల్సిన బాధ్యత ఓ ప్రజాప్రతినిధిగా మీ పై ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు కేంద్రం చేసే అన్యాయాలను సవరించే ప్రయత్నం చేయండి.

ఐటిఐఆర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసే విషయంలో, వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ విషయంలో, వరంగల్ టెక్స్ టైల్స్ పార్కుకు కేంద్రం సాయం అందించే విషయంలో, మంజూరైన అన్ని జాతీయ రహదారులకు నిధులు విడుదల చేసే విషయంలో, నీటి పంపకాలు త్వరగా పూర్తయ్యే విషయంలో, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టే విషయంలో,

ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరించే విషయంలో, సీలేరు పవర్ ప్లాంటు నష్ట పరిహారం చెల్లించే విషయంలో, ఎస్సీ వర్గీకరణకు ఆమోద ముద్ర వేయించే విషయంలో, ఎస్టీ రిజర్వేషన్ అమలయ్యే విషయంలో, కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ నెలకొల్పే విషయంలో, తెలంగాణకు రావాల్సిన నిధులు విడుదల చేయించే విషయంలో మీరు పోరాటం చేసి తెలంగాణ ప్రజల మన్ననలు పొందాలని కోరుతున్నాను.

కేంద్ర ప్రభుత్వ పథకాల్లో గానీ, మేకిన్ ఇండియా స్కీముల్లో గానీ, ఆత్మ నిర్భర్ భారత్ లాంటి విధానాల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వాటా దక్కడం లేదో వివరించండి. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో భాగం కాదా? తెలంగాణ ప్రజలు ఈ దేశ జనాభా లెక్కలోకి రారా? లేకుంటే తెలంగాణను బిజెపి వదిలేసుకుందా? స్పష్టత ఇవ్వండి. 
 
మీరు తెలంగాణ ప్రజల తరఫున కేంద్రంతో కొట్లాడుతారా? లేకుంటే తెలంగాణకు అన్యాయం చేసే బిజెపి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతారా? తేల్చుకోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా?: మంత్రి తలసాని