తెలంగాణ రాష్ట్ర నిధులు ఏ విధంగా దోపిడీ అవుతున్నాయో వివరించేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పర్యటన చేస్తున్నట్లు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. మధిర పట్టనానికి వచ్చిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
నాటి కాంగ్రేస్ మొదలు పెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ప్రధానంగా తుమ్మిడిహట్టి దగ్గర మొదలుపెట్టి.. చేవెళ్ల వరకు తాగు, సాగునీటిని అందించేలా రూ. 38 వేల కోట్లతో అంచనాలతో రూపొందించారని ఆయన చెప్పారు. అందులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లతో పనులు చేసిందని చెప్పారు.
తెలంగాణ ఆవిర్భవించక కొత్త ప్రభుత్వం కేవలం రూ.28 వేల కోట్లకు ఖర్చు చేస్తే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి తెలంగాణ సస్యశ్యామలం అయ్యేదని అన్నారు. ఏడాదికి రూ. 10 వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్ట్ ను మూడేళ్ళలో పూర్తి చేసినా 16 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని, అంతేగాక తెలంగాణలోని 80శాతం ప్రాంతానికి తాగునీరు లభించేదని అన్నారు.
అంతేకాక పరిశ్రమలకు అవసరమైన నీటి అవసరాలు తీరేవి అని చెప్పారు. కేవలం రూ.28 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ ను కమిషన్ల కోసం చంపేసి.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల అంచనాలతో రీ డిజైనింగ్ చేసారని అన్నారు. ఇక తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ పేరుతో రూ.50వేల కోట్లతో మరో ప్రాజెక్ట్ చేపట్టారని అన్నారు.
అంబెడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే ఇటు సాగు, అటు తాగు నీటి అవసరాలు తీరాడమేకాకా లక్ష 50 వేల కోట్ల రూపాయలు మిగిలేవని అన్నారు. ఈ ప్రాజెక్టులు కేవలం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు దోచుకెందుకు మాత్రమే చేసారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు వాస్తవ విషయాలను లెక్కలతో సహా వివరిస్తామని అన్నారు.
తెలంగాణ వరప్రదాయినిగా కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ను తీసుకువచ్చిందని అన్నారు. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేసి.. అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని సరఫరా చేసేందుకు అనుగుణంగా ప్రాజెక్ట్ ను డిజైన్ చేసినట్లు ఆయన వివరించారు.