తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో కలకలం రేగింది. తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలోని మరిపెడ ఎస్ఐగా పనిచేస్తున్న పొలిరెడ్డి శ్రీనివాస రెడ్డి తనపై అత్యాచారయత్నం చేశాడంటూ శిక్షణ మహిళా ఎస్ఐ (ట్రైనీ ఎస్ఐ) వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు వ్యవహారం బయటకు పొక్కింది. దీంతో సీపీ సూచన మేరకు జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. దీంతో తొర్రూరు డీఎస్పీ అధికారి వెంకటరమణ స్టేషన్‌కు వచ్చి విచారణ చేపట్టారు. ఈ విచారణలో లైంగిక వేధింపులకు పాల్పడింది నిజమేనని తేలడంతో మరిపెడ ఎస్‌ఐను సాయంత్రానికి సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
మరిపెడ పోలీస్ స్టేషన్లో శిక్షణ పొందుతున్న దళిత మహిళా ట్రైనీ ఎస్ఐ... ఎస్ఐ శ్రీనివాస రెడ్డి ట్రైనింగ్ పేరుతో అర్థరాత్రి ఫారెస్ట్‌కు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు తన కుటుంబసభ్యులతో కలిసి సీపీ తరుణ్జోషిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. గత రాత్రి తనను అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారని శిక్షణ మహిళ ఎస్ఐ ఫిర్యాదుచేశారు.
దీనిపై వెంటనే స్పందించిన సీపీ ఆరోపణలు రుజువైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం మహబాబాబాద్ జిల్లా పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు. ఎస్ఐ శ్రీనివాస రెడ్డిని అదుపులోకి తీసుకొన్న జిల్లా ఎస్పీ కోటిరెడ్డి.. విచారణ ప్రారంభించారు. వెనువెంటనే ఐజీ నాగిరెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు.
అయితే, 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వర్తించాడు. తొలుత కే సముద్రం, తరువాత గార్లలో పని చేశాడు. అక్కడి నుంచి మట్టెవాడకు వచ్చాడు. ఏప్రిల్ 14న మరిపెడకు బదిలీ అయ్యాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వామ్యమై ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్న అధికారిలో మరో కోణం బట్టబయలైంది.