శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో ఆరుగేట్లను మూసివేసి నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్‌కు 1,11,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ జూరాల నుంచి 1,62,326 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 20,680 క్యూసెక్కులు కలిపి నీటి ప్రవాహం 1,83,006 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది.
అదే సమయానికి జలాశయం నీటిమట్టం 885 అడుగులకు గాను 884.40 అడుగులకు చేరుకుంది. 211.95 టిఎంసిల నీరు నిల్వ ఉంది.
శ్రీశైలం నుంచి వరద ప్రవాహం తగ్గడంతో నాగార్జునసాగర్ 20 గేట్లు మూసివేసి నాలుగు గేట్ల ద్వారా 95,150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి మంగళవారం ఉదయం 2.13 లక్షల క్యూసెక్కులు విడుదల చేయగా సాయంత్రం 7 గంటలకు 1,79,006 క్యూసెక్కులు విడుదల చేశారు.
ప్రకాశం బ్యారేజీకి 3.2 లక్షలు ఇన్‌ఫ్లో ఉండగా 3.10 లక్షలు క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. మూడ్రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద రావడంతో గుంటూరు జిల్లాలోని కొల్లూరు, కొల్లిపర, భటిప్రోలు, రేపల్లె మండలాల్లోని లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది.