మంచిర్యాల ప్రభుత్వ బీసీ హాస్టల్‌లోకి బీరు బాటిల్స్ రావడం కలకలం రేపాయి. పదవ తరగతి విద్యార్థులు చుక్కేస్తూ ముక్క తీసుకునే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా మందు, మాంసంతో పదో తరగతి విద్యార్థులు ఇలా ఫేర్‌వెల్ పార్టీ చేసుకోవడం సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ విద్యార్ధులు.. ఫేర్ వెల్ పార్టీలో భాగంగా చికెన్ వండించుకున్నారు. హాస్టల్ కుక్ చికెన్ వండి పెట్టినట్లు తెలుస్తోంది.
వార్డెన్ కూడా రాత్రి తొమ్మిదిన్నర వరకు ఉండి వెళ్లిపోయాడు. ఆ రోజు వాచ్‌మెన్ కూడా లేడు. దీంతో పదో తరగతి చదువుతున్న బయటి విద్యార్ధులతో బీర్ బాటిల్స్ తెప్పించుకున్నారు.
అందరూ పడుకున్న తరువాత మందు, మాంసంతో పార్టీ చేసుకున్నారు. పదో తరగతి విద్యార్ధులు బీర్లు తాగడం, ఆ ఫొటోలు బయటకు రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ చేయాలంటూ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కు దేశాలు జారీ చేశారు.
దర్యాప్తులో విద్యార్ధులు మద్యం సేవించింది నిజమేనని తేల్చారు. పదో తరగతి అయిపోతోంది కదా పార్టీ చేసుకుంటాం అనగానే.. తన సొంత డబ్బులతో చికెన్ తీసుకొచ్చి వండించాడు హాస్టల్ వార్డెన్ మల్లేష్. అందరూ తినే సమయంలో కాకుండా.. ప్రత్యేకంగా వారి గదిలోకి చికెన్ తీసుకెళ్లారు.
ఎలాగూ తిని పడుకుంటారు కదా అని రాత్రి తొమ్మిదిన్నరకు వార్డెన్ కూడా వెళ్లిపోయాడు. ఆ తర్వాత విద్యార్థులు బీర్ బాటిల్స్ తెప్పించుకుని మద్యం సేవించినట్లు తేలింది.
బీర్లు తాగామని పదో తరగతి విద్యార్ధులు ఒప్పుకోవడంతో.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించామని చెప్పుకొచ్చారు.