రంగారెడ్డిలో భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త.. ముక్కలు ముక్కలుగా చేసి..?
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి అనంతరం ఆ ముక్కల్ని సూట్‌కేసులో పెట్టి మదనపల్లి వద్ద పెట
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి అనంతరం ఆ ముక్కల్ని సూట్‌కేసులో పెట్టి మదనపల్లి వద్ద పెట్రోల్ పోసి తగలపెట్టి పారిపోతుండగా అతడ్ని స్థానికులు పట్టుకున్నారు. అతడి కారు బురదలో కూరుకుపోవడంతో స్థానికులకు పట్టుబడ్డాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణ ఘటన శంషాబాద్ సమీప మదనపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... గచ్చిబౌలిలోని జైన్ శిల్ప సైబర్‌వ్యూలో అద్దెకుంటున్నరూపేష్ అగర్వాల్ స్వస్థలం ఆగ్రా. ఇతడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం దక్షిణాఫ్రికాలోని కాంగో దేశానికి చెందిన సింతియాను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరి అన్యోన్య దాంపత్యానికి సానియా అనే ఏడేళ్ల పాప ఉంది. రూపేష్ తన కూతురితో కారులో(టీఎస్099344) శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామ సమీపంలోని గ్రీన్‌సిటీ వెంచర్ వద్దకు రాత్రి 10 గంటల ప్రాంతంలో చేరుకుని ఖాళీ స్థలంలో భార్య సింతియా(35)మృతదేహాన్ని సూట్‌కేసులోంచి బయటకు తీసి పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు.
అనంతరం అక్కడి నుంచి పారిపోతుండగా కారు బురదలో చిక్కుకుంది. దీంతో మదనపల్లి గ్రామస్థులకు అనుమానం వచ్చి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని తీరుని చూసి అనుమానం చెందిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని రూపేష్‌ని తమదైనశైలిలో విచారించారు. దీంతో అతడు అసలు విషయాన్ని బయటపెట్టాడు. భార్యని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న కారణాలపై నిందితుడు రూపేష్‌ను విచారించారు.
మార్కెట్‌లో నష్టాల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయని, ఈ క్రమంలోనే భార్య సింతియాను హత్య చేశానని రూపేష్ పోలీసులకు ముందు ఒప్పుకున్నాడు. ఆదివారం రాత్రి సింతియా గొంతు నులిమి చంపివేసిన రూపేష్ మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి సోమవారం నిర్జన ప్రదేశానికి తీసుకువచ్చి దహనం చేయబోయాడు. మృతదేహం దుర్గంధం రాకుండా స్ప్రే చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.