Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అధిష్టానానికి కొండా సురేఖ షరతులు...ఎందుకో తెలుసా?

అధిష్టానానికి కొండా సురేఖ షరతులు...ఎందుకో తెలుసా?
, శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:43 IST)
హుజురాబాద్ బై పోల్స్‌లో బరిలో నిలిచేందుకు తాను సిద్దంగానే ఉన్నానని పీసీసీ అధిష్టానం పెద్దలకు చెప్పిన కొండా సురేఖ అధిష్టానానికి కొన్ని షరతులు పెట్టినట్టుగా తెలుస్తోంది.

మరో ఏడాదిన్నరలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తేనే హుజురాబాద్‌లో పోటీ చేసేందుకు సిద్ధమని సురేఖ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఉప‌ఎన్నికల్లో పోటీ చేసి తన బలాన్ని పెంచుకుంటానని, అందువల్ల 2023లో ఆ సీటు మళ్లీ తనకే కేటాయించాలని డిమాండ్ చేశారట.
 
దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ అర్బన్, పరకాల, భూపాలపల్లి టికెట్లను తాను చెప్పిన వారికి ఇస్తానని కూడా ఇప్పుడే హామీ ఇవ్వాలని సురేఖ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. అయితే భూపాలపల్లి విషయంలో అధిష్టానం కొంత మీనామేషాలు లెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న గండ్ర సత్యనారాయణ రావు పేరును భూపాలపల్లికి పరిశీలిస్తున్నందున ఆమెను ఒప్పించే ప్రయత్నంలో కొంత మంది పెద్దలు నిమగ్నమైనట్లు సమాచారం. భూపాలపల్లి విషయంలో వెనక్కి తగ్గితే వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్, పరకాల, వరంగల్ అర్బన్ స్థానాల్లో అభ్యర్థుల ఖరారు నిర్ణయం అమెకే వదిలేయాలన్న నిర్ణయానికి పార్టీ పెద్దలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
 
హుజురాబాద్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ కావడంతో అదే కేటగిరీకి చెందిన కొండా సురేఖను నిలబెడితే పార్టీకి బలం చేకూరుతుందని పీసీసీ పెద్దలు ఆలోచించారు. అంతే కాకుండా టీఆర్ఎస్, ఈటల వ్యతిరేక వర్గాన్ని ఆకట్టుకోవాలంటే కొండా సురేఖ లాంటి బలమైన నాయకురాలు బరిలో ఉంటేనే పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనా అక్కడ గెలిచే అభ్యర్థుల తలరాతలను మార్చే అవకాశం మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని నేతలు భావిస్తున్నారు. కొండా సురేఖ బరిలో ఉంటేనే అధికార టీఆర్ఎస్‌కు ముచ్చెమటలు పట్టించొచ్చని కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందువల్ల రెండు మూడు రోజుల్లో ఆమె అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరిలోవ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు.. ఎందుకో తెలుసా?