తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. అయితే పార్లమెంట్ సమావేశాలకు హజరయ్యేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్న సమయంలో రేవంత్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులు ఉండటం అనేక అనుమానాలకు దారితీస్తుంది.
పార్లమెంట్ సమావేశాలకు వెళ్లి, అక్కడే హోంమంత్రి అమిత్ షాకు, ప్రధానికి ఫిర్యాదు చేస్తానని, విచారణకు ఆదేశించాలని కోరుతానని హెచ్చరించారు. ఇంటలిజెన్స్ ప్రభాకర్ రావు, సీఎస్ సోమేష్ కుమార్‌ల అవినీతి అంశాలను కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తానని చెప్పిన రెండు రోజులకే రేవంత్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసు బలగాలు మొహరించారు. రేవంత్ రెడ్డిని ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకునేందుకే పోలీసులు వచ్చారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు.
మరోవైపు, కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ… అక్కడ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ భూములను సందర్శించాలని నిర్ణయించింది. ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు.
కోకాపేట్ భూముల అమ్మకంలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేలం వేసిన భూముల వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఆ భూములను పరిశీలించడానికి దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ రెడ్డి తదితర నేతలు.. కోకాపేటకు వెళ్లనున్నారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు జూబ్లీహిల్స్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. రేవంత్‌ను గృహనిర్బంధం చేశారు. ఆయన కోకాపేట వెళ్లకుండా ముందస్తుగానే అడ్డుకున్నారు. పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.