తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. బాహ్యరూపం ఆకర్షణీయంగా, హుందాగా ఉండాలని, లోపల అన్ని సౌకర్యాలు కలిగి పనిచేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉండేలా తీర్చాలని చెప్పారు. కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యకార్యదర్శులు సునిల్ శర్మ, రామకృష్ణ, రజత్ కుమార్, నర్సింగ్ రావు, ఆస్కార్-పొన్ని అర్కిటెక్స్ట్ నిపుణులు హాజరయ్యారు. డిజైన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. కొన్ని మార్పులు సూచించారు.
భవనంలో ఉండాల్సిన వాటిపై పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారులు వారి సిబ్బంది పనిచేయడానికి అనుగుణంగా కార్యాలయాలుండాలని పలు సూచనలు చేశారు కెసిఆర్.
ప్రతీ అంతస్తులో ఒక డైనింగ్ హాలు, సమావేశ మందిరం ఉండాలని, విఐపిలు, డెలిగేట్స్, డిగ్నిటరీస్, ఇతర ప్రముఖులు, అతిథుల కోసం ప్రత్యేక వయిటింగ్ హాళ్లు ఉండాలని చెప్పారు.
సెక్రటేరియట్లో ఏం పని జరుగుతుంది? ఎందరు పనిచేస్తారు? ఎందరు సందర్శకులుంటారు? తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.