Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో అధికారం మనదే... సమన్వయంతో పని చేయండి : నేతలకు వేణు హితవు

Advertiesment
congressflags
, గురువారం, 7 సెప్టెంబరు 2023 (10:54 IST)
ఈ యేడాది ఆఖరులో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాబోతుందని, అందువల్ల ప్రతి ఒక్క నేత సమన్వయంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హితవు పలికారు. బుధవారం రాత్రి తాజ్‌కృష్ణ హోటల్‌లో టీఎస్ పీసీసీ ముఖ్య నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాణిక్ రావ్ ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల ఏఐసీసీ పరిశీలకులు దిపదాస్ మున్నీ, మీనాక్షి నటరాజన్‌ తదితరులతో కేసీ వేణుగోపాల్ ఒక సమీక్ష నిర్వహించారు.
 
ఇందులో పార్టీ నేతలు దామోదర రాజనర్శింగా, మధుయాష్కీ, సంపత్ కుమార్, అంజన్ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తదితరులు హాజరయ్యారు. రాత్రి 10 గంటలకు వరకు జరిగిన సమావేశంలో ఈ నెల 16న నిర్వహించనున్న సీడబ్ల్యూసీ సమావేశం, 17న జరిగే బహిరంగ సభలపై వేణుగోపాల్ చర్చించారు. 
 
సీడబ్ల్యూసీ సమావేశానికి పార్టీ జాతీయ నేతలంతా హాజరవుతున్నందున ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్యనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతోపాటు చాలామంది నేతలు 16, 17 తేదీల్లో హైదరాబాద్లోనే ఉంటారని తెలిపారు. సభ నిర్వహణకు పార్టీ నేతలతో ఆహార, రవాణా, సమన్వయ తదితర కమిటీలను ఏర్పాటుచేశారు. 
 
వీటికి నేతలు మధుయాస్కీ, మహేశ్ గౌడ్, షబ్బీర్ అలీ తదితరులు నాయకత్వం వహించాలని సూచించారు. సభకు ప్రతి మండలం నుంచి జనాన్ని సమీకరించాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెబుతూ ఐదు హామీలపై గ్యారంటీ పత్రాన్ని బహిరంగ సభలో సోనియా విడుదల చేస్తారని తెలిపారు. ఈ గ్యారంటీ హామీలను, భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర నాయకులంతా ఐకమత్యంతో పనిచేస్తే విజయం సాధ్యమని స్పష్టంచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయుధాలను అమ్మడం కోసం రష్యాకు కిమ్ రైలు ప్రయాణం