తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఇరుకుల్లలోని ఓ ఇంట విషాదం జరిగింది. మరో వారంలో తన కుమార్తెకు పెళ్లి చేయాల్సిన ఓ తండ్రి అకాల మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. దీంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పచ్చవ వెంగయ్య(47) భార్య హేమలతతో కలిసి 20 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కరీంనగర్‌కు వచ్చి కిసాన్‌నగర్‌లో నివాసముంటున్నారు.
ముగ్దుంపూర్ శివారులో ఇటుకబట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వెంగయ్యకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు వర్ష వివాహం శ్రీహరి లోహిత్‌తో ఈ నెల 23న పాలకొల్లులో జరిపించడానికి ముహూర్తం పెట్టుకొని పెళ్లిపత్రికలు అచ్చు వేయించి, బంధువులకు, స్నేహితులకు పంపిణీ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే దసరా పండగ సందర్భంగా ఇటుక బట్టీలవద్ద కూలీలను కలిసి వారికి పండుగ ఏర్పాట్లను చేశారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన కారులో ఇంటికి బయలు దేరారు. ఇరుకుల్ల వాగు సమీపంలో ఎదురుగా వచ్చిన వాహనం లైట్లతో రోడ్డుపైన ఉన్న డివైడర్ కనిపించక కారు డివైడర్ మీద నుంచి అవతలి వైపునకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది.
కారు బెలూన్లు తెరుచుకున్నప్పటికీ కారు వేగంగా ఉండటంతో వెంగయ్య వెనుక సీటులోకి ఎగిరిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వెంగయ్య అంత్యక్రియలు శనివారం సాయంత్రం కరీంనగర్‌లో జరిపించినట్లు ఆయన స్నేహితులు తెలిపారు.